ప్రొఫెషనల్ క్రిమినల్‌గా మారిన సాప్ట్‌వేర్ ఉద్యోగి.. కన్ను పడిందంటే క్షణాల్లో దొంగతనం జరగాల్సిందే..

Srikakulam District News: ప్రతి నెలా లక్షకు పైగా జీతం అందుకునేవాడు. అలా వచ్చిన శాలరీతో లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డాడు. ఖరీదైన కారు, లగ్జరీ ఎంజాయ్ చేసేవాడు. ఈ క్రమంలోనే జూదం, బెట్టింగ్ పాటు పలు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తర్వాత రోజుల్లో వచ్చిన జీతం చాలక అప్పుల పాలయ్యాడు. అంతే కాకుండా బెట్టింగ్స్‌లో కూడా భారీగా డబ్బు..

ప్రొఫెషనల్ క్రిమినల్‌గా మారిన సాప్ట్‌వేర్ ఉద్యోగి.. కన్ను పడిందంటే క్షణాల్లో దొంగతనం జరగాల్సిందే..
Thief Haribabu (in Cover)

Edited By:

Updated on: Sep 29, 2023 | 10:04 PM

విజయనగరం జిల్లా, సెప్టెంబర్ 29: అతను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మంచి ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. ఢిల్లీ, గుర్గావ్, వరంగల్ వంటి ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాడు. ప్రతి నెలా లక్షకు పైగా జీతం అందుకునేవాడు. అలా వచ్చిన శాలరీతో లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డాడు. ఖరీదైన కారు, లగ్జరీ ఎంజాయ్ చేసేవాడు. ఈ క్రమంలోనే జూదం, బెట్టింగ్ పాటు పలు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తర్వాత రోజుల్లో వచ్చిన జీతం చాలక అప్పుల పాలయ్యాడు. అంతే కాకుండా బెట్టింగ్స్‌లో కూడా భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. వడ్డీలు కూడా మరింతగా పెరగడంతో రోజు రోజుకు అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి కూడా పెరిగింది.

దీంతో ఎలాగైనా అప్పులు తీర్చాలని ఉన్న ఉద్యోగం మానేసి కొత్త జీవితానికి తెరలేపాడు. ఉన్న సాప్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి దొంగతనాలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. మొదట బంధువుల ఇంట్లో దొంగతనం చేసి తెలివిగా తప్పించుకున్నాడు. అలా అక్కడ బయలుదేరిన తన నేర ప్రవృత్తి నిత్య జీవితంగా మారింది. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, ఉత్తరాంధ్రలోనే అనేక నగరాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడ్డాడు. తన బంధువుల ఇళ్ల నుండి గుర్తు తెలియని వారి వరకు ఎక్కడ, ఏ అవకాశం దొరికినా వదల్లేదు. పగలు రెక్కీ నిర్వహించేవాడు, రాత్రులు దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల రాజాం వాసవి నగర్‌లోని ఓ టీచర్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. అంతే ఆ ఇంట్లోని విలువైన బంగారం, నగదు పోయాయి.

ఇక చేసేదేమి లేక భాదితులు లబోదిబోమంటూ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జరిగిన దొంగతనం చూస్తే పక్కా ప్రొఫెషనల్‌గా ఉంది. దీంతో నిందితుడు ఎవరో కనిపెట్టడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. దొంగను కనిపెట్టి పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగానే మారింది. ఈ క్రమంలోనే దొరికిన పలు ఆధారాలతో ఎట్టకేలకు నిందితుడుని గుర్తించారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా కరజాడకు చెందిన బలగా హరిబాబుగా గుర్తించారు. గతంలో కూడా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో అనేక చోట్ల ఈ తరహా దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో హరిబాబును కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేళకు శ్రీకాకుళంలో హరిబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం పోలీసులు తనదైన శైలిలో విచారించగా నేరాలను ఒప్పుకున్నాడు. రాజాం వాసవీనగర్‌లో టీచర్ ఇంటితో పాటు జిల్లాలో చేసిన మరి కొన్ని నేరాలను ఒప్పుకున్నాడు. దొంగతనాలు ఏ విధంగా చేసేవాడు..? దొంగతనంకు ముందు రెక్కీ ఎలా జరిపేవాడు..? దొంగతనం చేసిన తరువాత దొంగిలించిన బంగారం ఏమి చేసేవాడు..? వంటి హరిబాబు చెప్పిన అనేక షాకింగ్ నిజాలు పోలీసులనే విష్మయానికి గురి చేశాయి. తరువాత అతని వద్ద నుండి 241 గ్రాముల బంగారం,  60,000/- నగదు స్వాధీనం చేసుకొని కటకటాలకు పంపారు పోలీసులు.