Nandyal Journalist Murder Case: కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ కేశవ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్య కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కా మాఫియాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సుబ్బయ్య, ఆయన సోదరుడు నానిలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాలలోనే మకాం వేసిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.. నిందితులను అరెస్టు చేసేలా స్థానిక పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ మేరకు గత రాత్రి జరిగిన జర్నలిస్టు కేశవ హత్య కేసులో నిందితులను సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. కాగా జర్నలిస్టు హత్యపై ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రామాంజి నాయక్‌ను నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హత్యకు సంబందించిన అన్ని అధారాలు సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. బలమైన సాక్ష్యాధారాలతో నిందితులకు ఖచ్చితంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నంద్యాల హత్యోదంతంపై డీజీపీ సీరియస్..
కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ జర్నలిస్ట్ కేశవ్ హత్య ఘటనపైన ఏపీ డీజీపీ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. హత్యకు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌తో పాటు జర్నలిస్ట్ కేశవ్ హత్యతో ప్రమేయం ఉన్న అందరినిపైనా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి , కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.
హత్య ఎందుకు జరిగింది? ఎలా జరిగింది..?
నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్‌లో కేశవ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. గుట్కా మాఫియాతో నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్యకున్న సంబంధాలపై తన యూట్యూబ్ ఛానల్‌లో వార్త రాశాడు. నంద్యాల టూ టౌన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుబ్బయ్య… అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని ఆధారంగానే తనను ఇటీవల ఎస్పి సస్పెండ్ చేయడంతో కేశవపై కానిస్టేబుల్ సుబ్బయ్య కక్ష కట్టాడు. నంద్యాలలో రాత్రి పదిన్నర గంటల సమయంలో మాట్లాడాలి రమ్మని కేశవను కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు నాని పిలిపించుకున్నారు. కేశవ వచ్చిన వెంటనే స్క్రూ డ్రైవర్ తో ఆయన్ను విచక్షణా రహితంగా పొడిచారు. గాయాలపాలైన కేశవ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.
నంద్యాలలో జిల్లా ఎస్పీ మకాం..
నంద్యాలలో జరిగిన జర్నలిస్ట్ హత్యోదంతాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. అర్ధరాత్రి నంద్యాల చేరుకున్న ఆయన.. హత్య స్థలాన్ని పరిశీలించి కుటుంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేశవను కానిస్టేబుల్ సుబ్బయ్య హత్య చేశాడని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎస్పీకి తెలిపారు. ఆ మేరకు జర్నలిస్ట్ కేశవ హత్య కేసుకు సంబంధించి కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు నానిలపై హత్య కేసులు నమోదు చేశారు. హత్య చేసిన వెంటనే ఇద్దరు నిందితులు పారిపోగా.. వారి కోసం ప్రత్యేకంగా రెండు టీములు ఏర్పాటు చేశారు. వారిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి నంద్యాలలోనే మకాం వేసి నిందితులను అరెస్టు చేసేలా స్థానిక పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించారు.
జర్నలిస్ట్ సంఘాల ఖండన..
అటు జర్నలిస్ట్ కేశవ దారుణ హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కన్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. నేడు జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హత్యకు కారణమైన కానిస్టేబుల్ సుబ్బయ్య, ఆయన సోదరుడు నానిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం