
కాకినాడ జిల్లాలో రిమాండ్ ఖైదీ పరారీ ఘటన కలకలం రేపింది. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ POCSO కేసులో రిమాండ్‌లో ఉన్న 20 ఏళ్ల అడిగర్ల భానుప్రకాష్ అలియాస్ కన్నయ్య కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కాకినాడ జిల్లా కోటవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన భానుప్రకాష్‌ను POCSO కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం తుని సబ్‌జైలుకు తరలించారు. అయితే వైద్య పరీక్షల కోసం అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల పర్యవేక్షణ నుంచి తప్పించుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తుని రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. భానుప్రకాష్ వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ అతడు ఏ మార్గంలో వెళ్లాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భానుప్రకాష్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తుకు సహకరించాలని ప్రజలను అధికారులు కోరారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..