AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్‌ ట్యాపింగ్‌! తనకు రికార్డింగ్‌ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్‌

తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీకి విస్తరించింది. వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి కూడా ఇదే విషయంపై ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించింది.

ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్‌ ట్యాపింగ్‌! తనకు రికార్డింగ్‌ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్‌
Ys Sharmila
SN Pasha
|

Updated on: Jun 19, 2025 | 10:48 AM

Share

ట్రింగ్‌ ట్రింగ్‌మని తెలంగాణలో మోగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ బలంగా వినిపిస్తోంది. పొలిటికల్‌గానూ అగ్గి రాజేసేట్టు కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో విచారణ కొనసాగుతుండగానే.. అటు నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్‌.. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి మరి. తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం.. ఏపీని కూడా షేక్‌ చేయబోతోందా? అంటే… పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయ్‌. తెలంగాణలో ఫోన్ టాపింగ్ ముమ్మాటికీ నిజమంటూ… ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన కామెంట్స్‌తో రచ్చ మొదలైనట్టే కనిపిస్తోంది. నాటి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల జాయింట్‌ ఆపరేషన్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ షర్మిల.

బైబిల్‌ మీద ప్రమాణానికి సిద్ధం.. నా బిడ్డల మీద ప్రమాణానికి సిద్ధం.. నేను చెప్పేది పచ్చి నిజం అంటున్నారు షర్మిల. ఎందుకంటే ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డే తనకు చెప్పారంటూ పెద్ద బాంబు పేల్చారు. తన ఫోన్ సంభాషణను తనకే వినిపించారంటూ మరో ముచ్చట చెప్పి దుమారానికి ఎగస్ట్రా పవర్‌ యాడ్‌ చేశారు షర్మిల. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయటానికే ఫోన్ ట్యాపింగ్ చేయించారని షర్మిల చేస్తున్న ప్రధాన ఆరోపణ. భర్త బ్రదర్‌ అనిల్‌తో పాటు తనకు అండగా నిలబడ్డా ప్రతీ ఒక్కరినీ బెదిరించారని చెబుతున్నారు. అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయటానికి సిద్ధమని ప్రకటించారు. ఈ మాటలు ఎంక్వైరీ కమిషన్‌ ముందు చెప్పడానికైనా తాను సిద్ధమన్నారు.

ఒక్క షర్మిలతో ఆగిపోతే ఈ ఆరోపణలతో అగ్గి రాజుకునేది కాదేమో. అధికార కూటమి ఎమ్మెల్యే కోటంరెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో రచ్చ పీక్స్‌కు చేరినట్టు అయింది. అప్పట్లో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆధారాలతో బయటపెట్టానని, ఏపీలో ఈ వ్యవహారంపై విచారణ జరిపితే, చాలా మంది ముఖ్యులు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అలా ఆరోపణలు వచ్చాయో లేదో ఇలా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టిపెట్టామని, అవసరమైతే విచారణ జరిపిస్తామని చెప్పారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. అయితే, షర్మిల ఆ స్థాయిలో ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆరోపణలు గుప్పిస్తే అది సర్వసాధారణమన్నట్టుగా కొట్టిపారేశారు కేంద్ర మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చింతా మోహన్‌. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ ఇది చట్ట వ్యతిరేకమన్న ఆయన ఈ పరిణామాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మొత్తానికి ఓవర్‌ టూ ఏపీ అన్నట్టుగా తెలంగాణ నుంచి పక్కరాష్ట్రంలోకి పాకిన ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి