Pawan Kalyan: జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.. ప్లీనరీ ఎప్పటినుంచో తెలుసా..

|

Jan 04, 2025 | 9:49 AM

జనసేన ప్లీనరీకి ప్లేస్, టైమ్ ఫిక్స్‌ అయ్యింది. మార్చిలో మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహించనున్నారు. అయితే, ఈసారి ప్లీనరీ సమావేశాల వెనుక జనసేనాని వ్యూహాలు గతానికి భిన్నంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan: జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.. ప్లీనరీ ఎప్పటినుంచో తెలుసా..
Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్న పవన్ కల్యాణ్.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ప్లీనరీని గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు జనసేనాని. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ సమావేశాలను నిర్వహించబోతున్నారు.

జనసేన బలంగా ఉన్న ప్రాంతాలపైనే దృష్టి..

ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనసేన బలం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది. అక్కడ పార్టీని పటిష్టం చేసుకుంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చనే ధీమాతో జనసేనాని ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు గతంలో అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా ఘాటుగా ఉండేవి. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ దూకుడు తగ్గిందనే చర్చ మొదలైంది.

ప్లీనరీతో పార్టీలో ఉత్సాహం నింపే ప్లాన్

ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు పవన్ ప్లీనరీని వాడుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో సఖ్యత కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కల్యాణ్, పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిస్ధితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్క రోజు జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభను కాస్తా ప్లీనరీగా మార్చి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్లీనరీ సందర్భంగా పార్టీలో చేరికలు కూడా ఉంటాయనే చర్చ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..