Pawan kalyan: ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం పలికారు పవన్. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారని పవన్ పేర్కొన్నారు.

Pawan kalyan: ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం : పవన్ కళ్యాణ్
PM Modi - Pawan Kalyan

Updated on: Mar 17, 2024 | 5:59 PM

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. మూడు పార్టీల పొత్తు కుదిరిన అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదిక కనిపించడంతో.. అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.  2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఒక సారా వ్యాపారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం పవన్ చెప్పారు. ఐదుకోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని.. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు పవన్. ఎన్డీఏ కలయిక.. ఐదుకోట్ల మంది ప్రజలకు ఆనందం అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారని పవన్ చెప్పారు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రావణ సంహారం జరుగుతుంది.. త్వరలోనే రామరాజ్య స్థాపన జరుగుతుందన్నారు పవన్. అమరరాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏపీ నుంచి వెళ్లిపోయాయని.. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా.. ఈరోజు -3 శాతానికి దిగజారిపోయిందన్నారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఏపీ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చిందన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…