పొత్తులతో పార్టీలో తిరుగుబాట్లు తలెత్తకుండా చంద్రబాబు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై అసంతృప్త నేతలను క్షేత్రస్థాయిలోనే సెట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు బాటలోనే పవన్ పయనిస్తూ వరుస భేటీలతో అసమ్మతికి అడ్డుకట్ట వేస్తున్నారా? అనకాపల్లి అసంతృప్తిని చల్లార్చడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయా? పవన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయిపోయింది. ఇక బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందంటున్నాయి టీడీపీ, జనసేన వర్గాలు. దీంతో టీడీపీ, జనసేనల్లో చాలామంది నేతలు త్యాగరాజులు కావాల్సి ఉంటుంది. తమ సీట్లను కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటివాళ్లు ఇప్పటికే నిరసన స్వరాలు వినిపిస్తున్నారు. దీంతో ఉండవల్లి నివాసంలో మూడు రోజుల పాటు ఆశావహులతో మాట్లాడి, సీట్లు కోల్పోయేవారిని బుజ్జగిస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అలాంటివాళ్లను ఏదో రకంగా సెట్ చేస్తామని హామీ ఇస్తున్నారు.
ఇదిలాఉంటే.. మరోవైపు జనసేనలో కూడా సేమ్ సీన్ కనినిపిస్తోంది. టీడీపీతో పొత్తు ఖరారయినా, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏయే అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల నుంచి బరిలో దిగుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీనికితోడు బీజేపీతో కూడా పొత్తు ఉండే చాన్స్ ఉండడంతో, జనసేన ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమకు సీట్లు దక్కవేమో అనే భయం వాళ్లను వేధిస్తోంది. ఇక అనకాపల్లి పార్లమెంట్‌కు నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం..జనసేనలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా పార్టీ కేడర్‌తో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు నాగబాబు. అయితే నాగబాబు నిర్వహిస్తున్న సమీక్షలకు దూరంగా ఉంటున్నారు సీనియర్ నేత కొణతాల రామకృష్ణ. ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లేటెస్టుగా విశాఖ పర్యటనకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్…నేరుగా కొణతాల నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.
పవన్‌తో భేటీ తర్వాత కొణతాల మీడియా ముందుకొచ్చారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ చెప్పుకొచ్చారు. తాను ఎక్కడినుండి పోటీ చేయాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. పొత్తులపై పార్టీలు మాట్లాడుకుని నిర్ణయిస్తాయంటున్నారు ఆయన.
ఇక కొణతాలతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఉత్తరాంధ్ర అభివృద్దిపై చర్చించామన్నారు పవన్. ఢిల్లీ నుంచి వచ్చాక మరింత స్పష్టత వస్తుందంటూ అనకాపల్లి ఎంపీ సీటుపై హింట్ ఇచ్చారు ఆయన. మొత్తానికి అనకాపల్లిలో అసంతృప్తి జ్వాలలను చల్లార్చే ప్రయత్నం చేశారు పవన్.
ఇక జనసేన నేతలతో పవన్ ఇవాళ విడివిడిగా భేటీ కానున్నారు. తర్వాత రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, అనపర్తి నేతలతో మంతనాలు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారు పవన్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..