CBN-Pawan: చంద్రబాబు నివాసానికి పవన్‌ కల్యాణ్‌.. కీలక అంశాలపై చర్చలు

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య మైత్రి కొనసాగుతుంది. తాజాగా బాబుతో పవన్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

CBN-Pawan:  చంద్రబాబు నివాసానికి పవన్‌ కల్యాణ్‌.. కీలక అంశాలపై చర్చలు
Chandra Babu - Pawan Kalyan

Updated on: Apr 29, 2023 | 6:22 PM

ఏపీ రాజకీయాల్లో మరో బిగ్ డెవలప్‌మెంట్. హైదారాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.  చంద్రబాబుతో సమావేశం అయి.. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల కాలంలో ఇరువురు నేతలు భేటీ అవ్వడం 3వ సారి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాడే అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో  టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో  చంద్రబాబుతో పవన్‌ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో విపక్షాలన్నీ తోడేళ్లల కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి చూస్తున్నాయని సీఎం జగన్‌ పదే పదే విమర్శిస్తున్నారు. ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేసే దమ్ము లేదని కవ్విస్తున్నారు. ఈ విమర్శలకు మచిలీపట్నం సభలో పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. మేము ఒంటరిగా వస్తే మీకెందుకు.. కలిసి పోటీ చేస్తే మీకెందుకు అని జనసేన చీఫ్‌ ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా.. మీరు ఏం కోరుకుంటున్నారో.. మీ మనసులో ఏముందో అదే జరుగుతుందని మచిలీపట్నం సభలో పవన్‌ కల్యాణ్ చెప్పారు. కానీ.. పొత్తులపై స్పష్టత ఇవ్వలేదు.

ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్ బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారు. పొత్తులతో సహా అన్ని అంశాలపై మాట్లాడామని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు NTR శతజయంతి వేడుకల్లో పాల్గొని విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన చంద్రబాబు దగ్గరకు మరోసారి వెళ్లారు జనసేన అధ్యక్షుడు. దీంతో టీడీపీకి జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ మరింత చేరువ అవుతున్నారా? గతంలో విడిపోయిన బంధం మళ్లీ చిగురిస్తోందా…? అన్న అంచనాలు మొదలయ్యాయి.

మరిన్ని ఏపీ వార్తలు  కోసం క్లిక్ చేయండి..