Andhra Pradesh: లోకల్ వార్‌లో వారసుల సంగతేంటీ..? ఎవరు హిట్.. ఎవరికీ షాక్..!
పరిషత్ పోరులో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. వైసీపీ కంచుకోటలుగా ఉన్న ఏరియాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది మాత్రం రాజకీయ వారసుల ఫలితాలే. యస్.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కొందరు వారసులు ఘోర పరాజయాన్ని చవిచూడగా, మరికొందరు ఊహించని విజయంతో సత్తా చాటారు.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. మెజారిటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ పోరులో బరిలో నిలిచిన సీనియర్ నేతల వారసుల తుది ఫలితాలు తేలడంతో… క్షేత్రస్థాయి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారి గెలుపోటములపై సరికొత్త చర్చ నడుస్తోంది. పరిటాల శ్రీరామ్ విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీఅభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన.. వైసీపీ అభ్యర్థిపై తిరుగులేని మెజార్టీతో విజయకేతనం ఎగరేశారు. ఈ గెలుపుతో సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం వైపు పరిటాల శ్రీరామ్ అడుగులు వేగంగా పడుతున్నాయి.
ఇక ఉత్తరాంధ్రలో మాత్రం వైసీపీ వారసురాలికి గట్టి షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ఘోర పరాజయం పాలవ్వగా.. ఆయన కోడలు బొత్స పూజిత మాత్రం విజయనగరం జిల్లాలో గరివిడి జడ్పీటీసీ నుంచి వైసీపీ తరఫున 1,599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు కోడలు కిమిడి సంధ్యపై బొత్స పూజిత గెలుపొందారు. అలాగే.. బొత్స సత్యనారాయణ సోదరి వెంకటలక్ష్మి కూడా ఘన విజయం సాధించారు. విజయనగరం జిల్లా గుర్ల జెడ్పీటీసీ స్థానంలో 316 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారామె.
ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను కుమార్తె మజ్జి సిరిసహస్ర ఘన విజయం సాధించారు. విజయనగరం జిల్లా తెర్లాం జెడ్పీటీసీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 6,651 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇదే ఉత్తరాంధ్రలో కూటమి తరఫున నిలిచిన మరో వారసుడు సత్తా చాటారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి కుమారుడు గండి వంశీ దీప్ ఘన విజయం సాధించారు. విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని మొగలిపురం ఎంపీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగిన వంశీ దీప్.. పొలిటికల్ ఎంట్రీలోనే జయకేతనం ఎగరేశారు.
మొత్తంగా.. కొందరు వారసులు తమ తండ్రుల చరిష్మా, పార్టీ వేవ్‌తో రాజకీయ ఆరంగేట్రంలోనే విజయకేతనం ఎగరేస్తే.. మరికొందరు మాత్రం క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమై వెనుకబడిపోయారు. మరీ గెలుపోటములు భవిష్యత్ రాజకీయాల్లోనూ.. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో చైర్మన్ పీఠాల ఎంపికలో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తాయో చూడాలి.
