Papikondalu Boat Services: గోదావరిలో బోటు షికారుకు సర్వం సిద్ధమైంది. పాపికొండల అందాలను వీక్షించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండేళ్ల తర్వాత ఇవాల్టి నుంచి పాపికొండల టూర్ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభమవుతున్నాయి టూరిజం బోట్లు. రాజమండ్రి నుంచి వర్చువల్‌గా పాపికొండల బోట్లను ప్రారంభించనున్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. గండిపోచమ్మ గుడి నుంచి బోట్లను ప్రారంభించనున్నారు స్థానిక ఎమ్మెల్యే, టూరిజం అధికారులు.
గత అనుభవాలతో పాపికొండల విహారయాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లుచేసింది ప్రభుత్వం. 5 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేశారు. ప్రతి పర్యాటక బోటుకు ఎస్కార్ట్ బోటు తప్పనిసరి చేశారు. బోటు ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి వివరించారు.
తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.
అయితే.. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలపి టికెట్ ధరను రూ.1,250 గా ప్రభుత్వం అంతకుమందు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా.. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. పాపికొండల సర్వీసులతోపాటు భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: Drone Attack: బాగ్దాద్‌లో భారీ పేలుడు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడి..
విజయ గర్జన కాదు.. వరంగల్‌లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి.. ఈటల స్వాగత సభలో కిషన్ రెడ్డి ఎద్దేవా