Andhra: గేదెలు కుమ్ముకుని వెన్నులోకి విరిగిన తోక ఎముక.. X-ray లేకుండా ఎలా కనిపెట్టారంటే..
గేదెల పోరులో వెన్నులోకి విరిగిన తోక ఎముకతో బాధపడుతున్న గేదెకు పల్నాడు జిల్లాలోని వీరాటం గ్రామంలో డాక్టర్ సాయి మహేష్ రెడ్డి ఎక్స్-రే లేకుండానే విజయవంతంగా రోగ నిర్ధారణ చేశారు. తన చేతులు, పరిశీలన నైపుణ్యంతో, సూది పరీక్ష ద్వారా పగులు తీవ్రతను గుర్తించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

పల్నాడు జిల్లాలోని వీరాటం గ్రామంలో గేదెల మధ్య జరిగిన పోరులో ఒక గేదెకు తీవ్ర గాయం అయింది. పోరు సమయంలో గేదె తోక ఎముక వెన్నులోకి విరిగి లోపలికి వెళ్లడంతో గేదె తీవ్రంగా బాధపడింది. గాయంతో గేదె అస్వస్థతకు గురికావడంతో రైతు ఆందోళన చెందాడు. ఈ పరిస్థితిలో రైతు వెంటనే వెటర్నరీ డాక్టర్‌ను సాయం కోసం పిలిచాడు. అయితే వీరాటం లాంటి రిమోట్ గ్రామంలో ఎక్స్‌రే, స్కానింగ్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో లేవు. అయినా కూడా వెటర్నరీ డాక్టర్ సాయి మహేష్ రెడ్డి తన అనుభవం, నైపుణ్యంతో గేదెను జాగ్రత్తగా పరిశీలించారు. దాదాపు ఒక గంట పాటు చేతులతో పరిశీలిస్తూ, గాయమైన ప్రాంతాన్ని స్పష్టంగా గుర్తించారు. గేదె తోక ఎముక ఎంతవరకు విరిగిందో తెలుసుకోవడానికి డాక్టర్ ఒక సులభమైన ప్రాక్టికల్ టెస్ట్ చేశారు. గాయమైన భాగంలో సూదితో స్వల్పంగా కుచ్చినప్పుడు, గేదె స్పందించని చోట ఆ ప్రాంతం నొప్పి లేకుండా (చచ్చు పడిపోయి) ఉందని గుర్తించారు. దీని ఆధారంగా ఎముక విరిగిన పరిధిని ఖచ్చితంగా నిర్ధారించారు. ఎటువంటి యంత్రాలు లేకపోయినా, కేవలం చేతుల స్పర్శ, పరిశీలన, అనుభవంతో మంచి ఫలితాన్ని సాధించవచ్చని డాక్టర్ సాయి మహేష్ రెడ్డి నిరూపించారు.
వీడియో దిగువన చూడండి…
