అద్భుతం.. భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్న 65 అడుగుల భారీ మట్టి గణపతి.. ఎక్కడంటే?
వినాయక చవితి అంటే పీఓపీ, కెమికల్ రంగులే దర్శనమిచ్చే విగ్రహాలు కనిపించే ఈ రోజుల్లో.. పర్యావరణాన్ని కపాడే ఉద్దేశంతో గత 38 ఏళ్లుగా మట్టి గణపతిని తయారు చూస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పాలకొల్లు వాసులు. అంతేకాదు విగ్రహాన్ని ప్రతి ఏడా కొన్ని అడుగుల మేర పెంచుతూ ఈ సారి 65 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.ప్రస్తుతం తుది మెరుపులు దిద్ముకుంటున్న ఈ గణపయ్య ఈ నెల 14 నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఏలూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పండుగ శోభ ఉట్టిపడుతోంది. స్థానిక మావుళ్ళమ్మ పేటలోని రెల్లి వీధిలో రికార్డు స్థాయిలో 65 అడుగుల ఎత్తుతో మట్టి వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. పర్యావరణహితంగా పూర్తి మట్టితో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ గణనాథుడు ఈ ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
38వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు
రెల్లి సంఘం ఆధ్వర్యంలో 1988 నుంచి ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 38వ వార్షికోత్సవం కావడంతో ఉత్సవాలను మరింత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టేందుకు నిర్వాహకులు పూనుకున్నారు. గతంలో 60 అడుగుల వరకు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించగా, ఈసారి సరికొత్తగా 65 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. నవరాత్రులు ముగిసిన తర్వాత పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా, విగ్రహం ఉన్న ప్రాంగణంలోనే శాస్త్రోక్తంగా నిమజ్జనం చేయనున్నారు.
శిల్పి ఇంటి ప్రసాద్ సారథ్యంలో కళాకారుల శ్రమ
ప్రముఖ శిల్పి ఇంటి ప్రసాద్ నేతృత్వంలో కళాకారుల బృందం ఎంతో నిష్టతో, నిర్విరామంగా శ్రమించి ఈ మహోన్నత మట్టి విగ్రహాన్ని తీర్చిదిద్దింది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి కావడంతో రంగులద్దడం, తుది మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేశారు. ఈ నెల 14న చవితి నాటి నుంచి భక్తులకు కొలువుదీరనున్న ఈ లంబోదరుడిని దర్శించుకునేందుకు పాలకొల్లుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
