
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది….గత 50 సంవత్సరాలుగా బుర్రకథ కళాకారుడిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన అప్పారావు ఆకాశవాణి, దూరదర్శన్ లో సైతం ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందారు. 76 ఏళ్ళ అప్పారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దశదినకర్మ జరుగుతున్న రోజే కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఒక వైపు దుఃఖం, మరో వైపు సంతోషంతో అప్పారావును స్మరించుకున్నారు.
1949 సెప్టెంబర్ 9వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నడకుదురులో మిరియాల వెంకట్రామయ్య, తిరుపతమ్మలకు జన్మించిన అప్పారావు బుర్రకథ కళాకారుడిగా రావులపాలెంలో స్థిరపడ్డారు. భార్య మిరియాల నాగమణితో కలిసి ఎన్నో బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చిన అప్పారావు వందలాది మందికి శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దారు. భార్య నాగమణి 2018లో మరణించగా ఈనెల 15వ తేదీన అప్పారావు కన్నుమూశారు.
రామచంద్రపురం ప్రాంతానికి చెందిన టీవీ రేడియో కళాకారుడు రావిశెట్టి వీరేశం శిష్యుడైన అప్పారావు బుర్రకథకి జీవం పోసి ప్రత్యేక గుర్తింపు పొందారు. 1974లో రేడియో, 1993లో దూరదర్శన్ లో ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పిస్తూ ఆయన చేసిన బుర్రకథ గానం ప్రజలను ఆకట్టుకునేది. బుర్రకథకి జీవం పోసిన అప్పారావు 1975లో పెద్దాపురంలో జరిగిన బుర్రకథ పోటీల్లో 50 తులాల వెండి కప్పు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రస్తుతం ఆయన కుమారులు, కుమార్తెలతో పాటు మనవలు సైతం బుర్రకథ కళా రంగంలోనే కొనసాగుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. అప్పారావుకు పద్మశ్రీ అవార్డు రావడంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారి ఇంటికి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. అప్పారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.