ఏపీలో పాక్ గూఢచారి నెట్‌వర్క్.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్.. నేవీ సిబ్బందితో సహా 18 మంది అరెస్ట్!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌వర్క్‌ను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఛేదించింది. 'ఆపరేషన్ ఫైర్‌వాల్-2026'లో భాగంగా 18 మంది అనుమానితులపై, ముఖ్యంగా నేవీ సిబ్బందిపై దృష్టి సారించారు. విశాఖలోని రక్షణ రహస్యాలు లక్ష్యంగా సాగిన ఈ గూఢచర్యంలో కీలక సమాచారం చేరవేతకు ప్రయత్నించారు. ఇద్దరి అరెస్టుతో దర్యాప్తు ముమ్మరమైంది, జాతీయ భద్రతకు ముప్పుపై ఆందోళనలు రేకెత్తాయి.

ఏపీలో పాక్ గూఢచారి నెట్‌వర్క్.. ఆపరేషన్ ఫైర్‌వాల్.. నేవీ సిబ్బందితో సహా 18 మంది అరెస్ట్!
Pakistan Spy Network Ap

Updated on: Oct 06, 2026 | 2:43 PM

అమరావతి: ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్‌వర్క్ కలకలం రేపుతోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 18 మందిపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’లో భాగంగా ఏకకాలంలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీగా సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ఏపీతో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో గుర్తించిన 18 మంది అనుమానితుల్లో 13 మంది నేవీ సిబ్బందిగా ఉన్నట్లు సమాచారం. వీరు పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో నేరుగా టచ్‌లో ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా కీలక సమాచారం చేరవేసినట్లు వచ్చిన అనుమానాలపై విచారణ కొనసాగుతోంది.

విశాఖపట్నంలోని నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారమే ఈ గూఢచర్య నెట్‌వర్క్ ప్రధాన టార్గెట్‌గా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానితుల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. 18 మందిలో ఇద్దరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో విశాఖకు చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌ను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఆపరేటివ్‌కు చేరవేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను విశాఖ జిల్లా జైలుకు తరలించారు.

మరోవైపు కోయంబత్తూరులో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. పాక్ ఆపరేటివ్ వాట్సాప్ యాక్టివేషన్ కోసం OTP షేర్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో కమ్యూనికేషన్, కీలక సమాచారం చేరవేతపై అధికారులు విచారణ చేస్తున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై కోయంబత్తూరు నుంచి విజయవాడకు తరలించిన ప్రదీప్ ముఖర్జీని కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.

మిగిలిన 16 మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని కీలక వివరాలను అధికారులు వెల్లడించలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us