
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లలో, అలాగే మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను కిలో రూ.32కే అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను కలిసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీలో ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యవసరాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారు. అలాగే ఇకపై రేషన్‌తో పాటు కందిపప్పును కూడా సబ్సిడీపై ఏపీ ప్రభుత్వం అందించనుంది.
మార్కెట్ ధర కంటే 25 నుంచి 30 శాతం తక్కువ ధరకు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కంది పప్పును ఏపీకి సరఫరా చేయనుంది. దీనిని నాలుగు నుంచి ఐదు నెలల పాటు పంపిణీ చేస్తారు. ఇది ప్రజల వంటింటి భారాన్ని తగ్గించే దిశగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంగా నిలవనుంది. పామాయిల్ ధరల నియంత్రణకు కూడా కేంద్రంతో చర్చలు జరిపినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో రేషన్‌తో పామాయిల్ సరఫరా చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీడీఎస్ బియ్యంలో నూకల శాతాన్ని 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏపీ పైలట్ ప్రాజెక్టును కేంద్రం త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయనుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెయ్యి మీమార్ట్ స్టోర్స్ అక్టోబర్ 1 నాటికి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటికే 870 దుకాణాలు ప్రారంభం అయ్యాయి.. ఈ దుకాణాల ద్వారా 64 రకాల నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 100, 250, 500 గ్రాముల చిన్న ప్యాకెట్లలో సరుకులు ఇక్కడ లభ్యమవుతాయి. రైతులకు ధాన్యం చెల్లింపులు 24 గంటల్లోనే కొనసాగుతాయని, పీడీఎస్‌లో పంచదార, పచ్చిశనగల పంపిణీ యథావిధిగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..