బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 11 నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడింది. అంతేకాకుండా.. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.. దీనితో పాటుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 11 నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వద్ద మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలు, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో బుధవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అంతేకాకుండా, జిల్లాల్లో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఆకస్మిక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
ఎల్లో అలర్ట్..
తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాలకు వర్షసూచన చేసింది. అంతేకాకుండా బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
హెచ్చరికలు (WARNINGS) :
ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
