ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటే టీడీపీ నేతల ఇళ్ళను లబ్దిదారులతో కలిసి ముట్టడిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. గతంలో యరజర్ల దగ్గర 25 వేల మందికి ఒకేచోట పట్టాలు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలను కోర్టుకు వెళ్ళి టీడీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. ఇప్పుడు కూడా ప్రైవేటు స్థలాలను 210 కోట్లతో కొనుగోలు చేసేందుకు సీఎంను ఒప్పంచి నిధులు తీసుకొస్తే దాన్నికూడా అడ్డుకునేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తే 25 వేల మంది లబ్దిదారుల కుటుంబాలతో టీడీపీ నేతల ఇళ్ళను ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో యరజర్ల దగ్గర ఒంగోలు నియోజకవర్గంలోని 25 వేల మంది పేదలకు జగనన్న కాలనీ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్దం చేశారు.
అయితే ఇక్కడ ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయంటూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినవారు టీడీపీకి చెందిన వారేనంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో మరెక్కడా ప్రభుత్వ భూములు లేకపోవడంతో ప్రైవేటు భూములు కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. దీని కోసం 210 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని సీఎంను కలిసినట్లు బాలినేని తెలిపారు. అందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినా నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చేసిన తరువాతే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో బహిరంగంగా ప్రకటించిన బాలినేని, తాను ఇచ్చిన హామీని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని అలకబూని ఒంగోలుకు రాకుండా 40 రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండిపోయారు. అనంతరం ప్రభుత్వం నుంచి రూ. 210 కోట్లు నిధులు విడుదల కావడంతో బాలినేని శాంతించి ఒంగోలుకు వచ్చారు.
ఈ నేపధ్యంలో ఒంగోలులో 25 వేల మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు విడుదలైన 210 కోట్ల నిధులతో పాటు మరో 21 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం విడుదల చేస్తూ జీవో జారి చేసింది. అందుకు అనుగుణంగా పనులు చకచకా జరుగుతున్నాయి. దీన్ని కూడా అడ్డుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కుట్ర చేస్తున్నారన్నది బాలినేని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా అడ్డుకుంటే దామచర్ల ఇంటిని లబ్దిదారులతో కలిసి ముట్టడిస్తానని బాలినేని హెచ్చరించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఫిబ్రవరి 10వ తేది తరువాత సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని బాలినేని స్పష్టం చేశారు.
పేదలకు పట్టాలతో పాటు లబ్దిదారులుగా ఉన్న మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. పట్టాలను పంపిణీ చేయడమేకాకుండా 5 లక్షల రూపాయలు విలువచేసే ఇళ్ళను కూడా నిర్మించి ఇస్తామని ఒంగోలులో జరిగిన 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బాలినేని ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని చోట్లా జగనన్న కాలనీలు కడుతుంటే ఒంగోలులో టీడీపీ నేతల నిర్వాకం కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి నిధులు తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..