గుంటూరుకు చెందిన నవీన్ చక్రవర్తి గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్.. కొద్దికాలం క్రితమే ఎస్పీగా నియమించారు. చక్రవర్తికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. ప్రణయ దీపిక ఎంఎస్ చదివింది. ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. డిసెంబర్ 17వ తేదీన గుంటూరులోని డాన్ బోస్కో చర్చిలో వివాహం జరిపించాలని ఇరు వర్గాల పెద్దలు నిర్ణయించారు. అనుకున్నట్లుగానే డిసెంబర్ 17 వ తేదీ సాయంత్రం అమ్మాయి విడిది ఇంటికి అబ్బాయి వాళ్లు కారు పంపించారు. అయితే అమ్మాయి మాత్రం తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కారులోనే చర్చి వరకూ వస్తానని చెప్పి అబ్బాయి వాళ్లు పంపిన కారును వెనక్కి పంపించారు. దీంతో అబ్బాయి తరుపు వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అబ్బాయి వాళ్లు పంపిన కారులోనే చర్చి వరకూ రావాలని సూచించారు. దీంతో అమ్మాయి తరపు వాళ్లు కాదు కూడదని అన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు పెద్దలు అబ్బాయి ఇంటి వద్దకు క్యూ కట్టారు. ఇరు వర్గాలు ఈగోకు పోవడం మంచిది కాదన్నారు. చిన్న చిన్న విషయాల్లో పట్టింపులకు పోవద్దని సలహా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వీరిద్దరూ కలిసి జీవితం సాగించాలని నచ్చజెప్పారు. దీంతో పట్టింపులకు పోయిన ఇరు వర్గాలు రాజీకి వచ్చారు.
అంతే నిన్న జరగాల్సి పెళ్లి అదే చర్చిలో ఈ రోజు జరిగింది. ఆగిపోయిన పెళ్లి తిరిగి జరగడంతో ఇరు వర్గాల ముఖాల్లోనూ సంతోషం వెల్లువెరిసింది. మరోవైపు రిసెప్షన్ కూడా హైదరాబాద్‌లో గ్రాండ్ చేసేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పెళ్లి తిరిగి పీటలెక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..