Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

అప్పయ్యమ్మ మాత్రం రేకుల షెడ్డులో ఒంటరిగా జీవించేది. పెద్ద కుమారుడు కొబ్బరికాయలు తీసే పని నిమిత్తం అమలాపురం వెళ్లగా, ఇంటి సమీపంలో పెద్ద కోడలు లక్ష్మి, మనవడు గౌరి నివాసముంటున్నారు. చిన్న కుమారుడు సూరప్పన్న కుటుంబంతో కలిసి భవానీ మాల దీక్ష విరమణ కోసం ఈ నెల 11న విజయవాడ వెళ్లాడు.

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా
Ap News

Edited By:

Updated on: Dec 17, 2025 | 2:02 PM

అర్ధరాత్రి ఆదమరిచి నిద్రలో ఉన్న వృద్ధురాలు తెల్లారేసరికి ఊరు బయట శవమై కనిపించింది. ఎవరూ లేని సమయంలో ఆమెపై జరిగిన అఘాయిత్యం ఏంటి? ఇంట్లో ఉన్న వృద్ధురాలు తెల్లారేసరికి మృతువుగా ఎలా మారింది? అసలు ఆ రాత్రి ఏమి జరిగింది? ఎందుకు ఆ గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలస సమీపంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో దారుణ హత్య కలకలం సృష్టించింది. ముడసర్ల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలు శుక్రవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. దుండగులు ఆమెను హతమార్చి ఒంటిపై ఉన్న సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అప్పయ్యమ్మ భర్త కొంతకాలం క్రితమే మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులు కుటుంబాలతో వేర్వేరుగా నివాసముంటున్నారు. అప్పయ్యమ్మ మాత్రం రేకుల షెడ్డులో ఒంటరిగా జీవించేది. పెద్ద కుమారుడు కొబ్బరికాయలు తీసే పని నిమిత్తం అమలాపురం వెళ్లగా, ఇంటి సమీపంలో పెద్ద కోడలు లక్ష్మి, మనవడు గౌరి నివాసముంటున్నారు. చిన్న కుమారుడు సూరప్పన్న కుటుంబంతో కలిసి భవానీ మాల దీక్ష విరమణ కోసం ఈ నెల 11న విజయవాడ వెళ్లాడు.

చిన్న కుమారుడి ఇంట్లో కోళ్లు ఉండడంతో వాటికి కాపలాగా అప్పయ్యమ్మ గత మూడు రోజులుగా అక్కడే నిద్రపోతోంది. శుక్రవారం రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో టీవీ చూస్తున్న అప్పయ్యమ్మ వద్దకు మనవడు గౌరి వచ్చి నువ్వు నిద్ర పో, నేను టీవీ ఆఫ్ చేసి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే శనివారం ఉదయం 10 గంటల వరకు ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన పెద్ద కోడలు లక్ష్మి ఇంటికి వెళ్లి చూసింది. తలుపు లోపల నుంచి గెడ పెట్టి ఉండటంతో వెనుకవైపు నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పయ్యమ్మ కనిపించలేదు. ఇంటికి సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ట్యాంక్ సమీపంలో, ఓ చిన్న గది వద్ద అప్పయ్యమ్మకు చెందిన సెల్‌ఫోన్, డబ్బులు పెట్టుకునే సంచి కనిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా ప్రహరీ లోపల అప్పయ్యమ్మ విగతజీవిగా పడి ఉన్నారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విజయనగరం డీఎస్పీ గోవిందరావు, సీఐ దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐ పాపారావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు ఆధారాలు సేకరించాయి. ఇంట్లోనే హత్య చేసి మృతదేహాన్ని ప్రహరీలోకి తీసుకొచ్చారా? లేదా హత్య అనంతరం బంగారం దోచుకుని మృతదేహాన్ని అక్కడికి ఈడ్చుకొచ్చారా? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సుమారు 150 మీటర్ల దూరం వరకు తీసుకెళ్లడం సాధ్యమా? తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో ఇతర వస్తువులకు ఎలాంటి నష్టం జరగకపోవడం, కేవలం బంగారమే చోరీ కావడంతో కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన జిల్లాలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.