Elderly Persons: వృద్దాప్యం నరకంగా మారుతోందా..? అనాధలుగా వీధుల్లో బ్రతుకుతున్న వృద్దులు

వృద్దాప్యం అనుభవించకుండా అర్ధాంతరంగా ఎవరు చనిపోవాలని కోరుకోరు. వయస్సు మళ్ళి, వంటి సత్తువ కరిగిన సమయంలో నా అన్న వాళ్ళతో కలిసి వుంటే రెండు ముద్దలు తిన్నా వృద్దులకు తృప్తిగా ఉంటుంది . కష్టం వచ్చినా..

Elderly Persons: వృద్దాప్యం నరకంగా మారుతోందా..? అనాధలుగా వీధుల్లో బ్రతుకుతున్న వృద్దులు
Elderly Persons
Follow us
B Ravi Kumar

| Edited By: Subhash Goud

Updated on: Jul 09, 2023 | 5:57 PM

  • ఆదరించని కుటుంబ సభ్యులు
  • అనాధలుగా వీధుల్లో బ్రతుకుతున్న వృద్దులు
  • రోడ్డున పడ్డ వృద్దులకు హక్కులు లేవా

వృద్దాప్యం అనుభవించకుండా అర్ధాంతరంగా ఎవరు చనిపోవాలని కోరుకోరు. వయస్సు మళ్ళి, వంటి సత్తువ కరిగిన సమయంలో నా అన్న వాళ్ళతో కలిసి వుంటే రెండు ముద్దలు తిన్నా వృద్దులకు తృప్తిగా ఉంటుంది . కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆదరించేందుకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలో , తోడబుట్టిన వాళ్ళో పక్కన ఉంటే కొండంత దైర్యం కలుగుతుంది . కానీ ఇది కంప్యూటర్ యుగం , ఎవరికి వారు ఎమునా తీరు అన్నచందంగా గడుపుతున్నారు . పిల్లలకు దూరంగా కొందరు తల్లితండ్రులు ఉంటున్నారు . మరికొందరు వారి ఆస్తులు పంచుకుని విధుల్లోకి గెంటి వేస్తున్నారు. ఇంకొందరు తమవారిని ఆశ్రమాల్లో చేర్పించి చేతులుదులుపుకుంటున్నారు ,. దీనికి ఎవరిని తప్పుపట్టలేని పరిస్థితి . ఎందుకంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కనుమరుగైపోయాయి. ఇంట్లో కన్నబిడ్డలను ప్లే స్కూల్స్ లోనో , అంగన్వాడీ కేంద్రాల్లోనే కాస్త డబ్బు ఉంటే కేర్ టేకర్ లకో అప్పగించి భార్య , భర్త ఉద్యోగాలకు వెలుతున్నారు . తమబిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని బాగా సంపాదించి మంచి కాన్వెంట్ ల్లో చేర్పించాలని ఆశ . వీరి ఆశ కన్నబిడ్డను తల్లి పాలు పట్టేందుకు సమయంలేకుండా , నాన్న భుజమెక్కే అవకాశం లేకుండా చేస్తుంది .

ఈమె చేసిన నేరం ఏంటి?

కన్నతల్లి తమకు భారంగా ఉందని కంటి చూపు లేని వృద్ధురాలిని కన్న కూతురే రైల్వే స్టేషన్ లో వదిలి వెల్లిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు లో చోటు చేసుకుంది. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామానికి చెందిన వృద్ధురాలు కామాక్షమ్మ(70) కు గత కొంత కాలంగా కళ్ళు కనిపించక బాధపడుతుంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు తన తల్లిని పోషించడం భారంగా భావించి పాలకొల్లు రైల్వే ఫ్లాట్ ఫారం పై అనాధలా వదిలి వెళ్ళింది. వృద్ధురాలు దీన స్థితిని చూసిన స్థానిక ఆటో డ్రైవర్లు వృద్ధురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు . చెరువులపై పని చేసే తన చిన్నకూతురు , అల్లుడు తనను అక్కడ వదిలి వెళ్లినట్లు తెలుసుకున్నారు . ఆమె ఇచ్చిన సమాచారంతో ఆటో డ్రైవర్ కలగంపూడి లో ని వారి బంధువుల వద్దకు తీసుకు వెళ్లగా వారెవరూ ఆమెను ఇంటిలోకి రానివ్వలేదు . తమకు ఏ సంబంధంలేదని తేల్చి చెప్పారు . దింతో మల్లి ఆటో డ్రైవర్ కుక్కల కృష్ణ ఆమెను రైల్వే స్టేషన్ కు తీసుకుని వచ్చారు . కామాక్షమ్మ సమాచారం తెలుసుకుని పోలీసులు ఆమెను ఆశ్రమంలో చేర్పించే ప్రయత్నం చేశారు . దానికి ఆమె నిరాకరించింది . దింతో మూడు రోజుల పాటు పాలకొల్లు రైల్వే స్టేషన్లో నే ఆవృద్ధురాలు ఉంది . ఆమె పెద్ద కూతురు ఉండి మండలం చిలుకూరు లో ఉందని ఆమె ఇంటికి వెళ్తానంటూ వృద్ధురాలు చెప్పడంతో చేసేదేమీ లేక ఆటో డ్రైవర్ స్థానికులు తిరిగి రైల్వే స్టేషన్ లోనే కామాక్షమ్మను ఉంచి పోషణ చూసిన పరిస్థితి. పోలీసులు వారి బంధువులకు ఫోన్ చేసినా స్పందించక పోవడం తో రైల్వే పోలీసులు వృద్ధురాలు కామాక్షమ్మ ను ఆమె పెద్ద కూతురు ఇంటికి తీసుకు వెళ్లి అప్పజెప్పారు.

చట్టాలు ఏం చెబుతున్నాయి ..

వృద్దులు కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా రోజు రోజుకూ వీధిన పడుతున్న వృద్దులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తల్లితండ్రులను వృద్ధాప్యం లో వారి పిల్లలు అనాధులుగా వదిలేస్తే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ అజమాయిషీ లో పని చేస్తుంది వీరి సమస్యను ట్రిబ్యునల్ 60 రోజుల్లోగా పరిష్కరించాలి. వృద్దులు కోసం తల్లితండ్రుల సంక్షేమం – సీనియర్ సిటిజన్ చట్టం 2007, వృద్దులు సంరక్షణ చట్టం 2019 లు అమలు లో ఉన్నాయి. వృద్దులును దూషించినా, నిర్లక్ష్యం చేసినా 6 నెలలు జైలు శిక్ష, 10 వేలు జరిమానా వరకు ఉంటుంది.

వృద్దులు తమ పోషణ కోసం పిల్లలను అడిగే హక్కు ఉంది. అల్లుడు, కొడలను పిల్లలు క్రిందకు తీసుకు వస్తూ బిల్లు సవరణ తీసుకు వచ్చారు.అంతే కాదు ఒంటరి గా జీవిస్తున్న వృద్ధుల సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ వారు , సామాజిక కార్యకర్తలు సహాయం తో సేకరించి వారిని ప్రతి నెలా సందర్శించి వారికి కావలసిన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి.అంతే కాదు 2007 లో ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం సెక్షన్( 23) ప్రకారం వృద్దులు తమ ఆస్తులను తమ సంతానం కు రాశాక వారిని చూడక పోతే తిరిగి ఆస్తి ను వెనక్కు తీసుకునే హక్కు కల్పించింది.

తోడు లేకపోతే ఒంటరి జీవితం నరకం

చట్టాలు చేసినా ఆస్తుల వున్నా ఇళ్లలో ఒకరకంగా , పేదల పట్ల మరో రకంగా చాలా దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి . భార్య , భర్తల్లో ఎవరో ఒకరు చనిపోతే పిల్లలకు దూరంగా ఉండే వాళ్లు ఒంటరి జీవితం అనుభవిస్తుంటారు . పేదకుటుంబమైతే ప్రభుత్వం ఇచ్చే రేషన్ , పెన్షన్ ల పైనే ఆధారపడాలి . ఇక మంచాన పడితే చేసేవారు సైతం ఉండరు . ఇది కామాక్షమ్మ జీవితంలో ఎదురైంది . కళ్ళు కనిపించకపోవటంతో ఆమెను చంటి బిడ్డలా ఒకరు ప్రత్యేకంగా చూసుకోవాలి . చెరువులపై కాపలా వుండే చిన్నకూతురికి ఇది కష్టమైన పనిగా మారింది . ఆమెకు తన ఆర్ధిక బాధలు , కుటుంబ సమస్యలు ఉండవచ్చు . కాని ఇపుడు ఒక ఆటో డ్రైవర్ స్పందించిన విధంగా ఆదరించలేక చాలా మంది వృద్ధుల జీవితాలు చీకటిలోనే కలిసిపోతున్నాయి . ఎక్కడో గుర్తు తెలియని శవాలుగానో కొందరు జీవితాలను , తనువును చాలిస్తున్నారు . వృద్దాప్యం శాపంగా మారకుండా ఉండాలంటే కుటుంబవ్యవస్థ బలపడాల్సిన అవసరం కనిపిస్తుంది.