విశాఖ పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్‌లో అపార్ట్మెంట్ ఫ్లాట్.. కుప్పలు తెప్పలుగా పాములు కలకలం రేపాయి. ఇంట్లో ఏసీ యూనిట్లో పాములు దూరినట్టు అనిపించింది ఆ కుటుంబ సభ్యులకు. బెడ్ రూమ్ ఏసీలోంచి ఏవో వింత శబ్దాలు.. వినిపించాయి. అయినా పట్టించుకోకుండా ఏసీ వేసేసరికి… ఆ స్ప్లిట్ నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పులుగా కనిపించడంతో భయంతో ఏసీని ఆపేశారు. దీంతో మళ్లీ పాములు లోపలకి వెళ్లిపోయాయి. చూసి వణికి పరుగులు పెట్టారు కుటుంబ సభ్యులు. స్నేక్ కేచర్ కిరణ్‌కు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పాములను బయటకు తీశాడు. చెట్లలో నివసించే ఈ పాములను బ్రాంజ్ బ్యాక్ పాములు అంటారని అంటున్నాడు స్నేక్ కిరణ్. ఇవి విషపూరితం కావని చెబుతున్నాడు.
ఆ పాములు అందులో అందుకోసమేనా..?!
పెందుర్తి పొలాగానేపాలెం నేతాజీ నగర్‌లోని ఓ ఇంట్లోని ఏసీలోకి చొరబడ్డాయి ఈ పాములు. పాములను చాకచక్యంగా బయటకు తీయడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం. ఏసీ అవుట్ డోర్ యూనిట్ నుంచి.. పైపు గుండా.. ఇండోర్ యూనిట్లోకి వచ్చి ఉంటుందని అంటున్నారు కిరణ్. చల్లదనానికి లేదా.. ఏసీలో చేరిన కొన్ని రకాల పురుగులు ఆహారంగా తీసుకునెందుకు అవి వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ఏకంగా బెడ్ రూమ్ ఏసీలోనే పాములు కనిపించడంతో ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంసంగా మారింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకిన వెంటనే.. ఏసి వేసుకోవాలంటే అంటే కాస్త ఆలోచిస్తున్నారు కొంతమంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..