ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో ఇద్దరిపైనా హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్డబ్యూ (నాన్‌బెయిలబుల్ వారెంట్) జారీ చేసింది. వచ్చే వాయిదాకు తప్పనిసరిగా రావాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.
గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ కంపెనీ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, ఇరువురు వైఎస్సార్సీపీ నాయకులు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా.. వారు నిర్లిప్తత వహించారు. మరోవైపు, గత వాయిదా సమయంలో హెరిటేజ్ ఆఫిసర్ సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు ముందుకు వెళ్లడం కష్టమని గత విచారణలో స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయో.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
జనవరి నెలలో తొలుత ఈ కేసులో కోర్టు విచారణ జరిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు కన్నబాబు, అంబటి రాంబాబు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ అనగా ..ఫిబ్రవరి 5న జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వ్యక్తిగత పూచీకత్తు, రూ.5 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో మంత్రితో పాటు ఎమ్మెల్యేపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Also Read: