
దేవరపల్లి, జులై 14: అల్లూరి జిల్లా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల రహదారు లేక అవస్థలు పడుతూ ఉన్నారు. తాజాగా జికేవిద్య మండలం దేవరపల్లి పంచాయతీ నక్కబంద గ్రామం నుంచి ఓ గర్భిణీ డోలి కష్టాలు వీడియో వైరల్ అవుతుంది. సాంగి సంధ్యా అనే గిరిజన మహిళ నిండు గర్భిణీ. పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలి. చీకటి పడింది.. గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రహదారి సౌకర్యం అంతంత మాత్రమే. ఆ రహదారి మధ్యలో మరో కాలువ. ఆ కాలువ దాటి వాహనాలు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో ఇక.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోలి కట్టారు. ఆ గర్భిణీకి డోలీమోసారు. కారు చీకట్లో రాళ్ళూ రెప్పలు దాటుకుంటూ ముందుకు వెళ్లారు. మొబైల్ టార్చ్ లైట్ వెలుతురులోనే దారి చూసుకుంటూ ముందుకు సాగారు.
ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ.. ఆ గర్భిణీలో ధైర్యం నింపుతూ డోలి మోసారు. దాదాపు కిలోమీటర్ల పైగా లక్కవరం వరకు ఆమెను మోసుకుంటూ వెళ్లారు. లక్కవరం నుంచి గూడెం కొత్త వీధి వరకు అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ గిరిజన మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం అంతంత మాత్రమే ఉండడంతో పాటు.. మధ్యలో కాలువ కారణంగా వాహనం రాలేకపోయిందని.. అందుకే డోలి మోయాల్సి వచ్చిందని అంటున్నారు గిరిజనులు. ఈ డోలి కష్టాలు తమకు తీర్చాలని కోరుతున్నారు.