అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడినవారు కేజీహెచ్, మెడికవర్, ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 32 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది చనిపోగా… 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.
డీజీపీ, చీఫ్ సెక్రటరీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు అందించింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పాటు.. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపైనా ఆరా తీసింది ఎన్‌హెచ్‌ఆర్సీ. అంతకుముందు ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్‌పై పెట్టిన శ్రద్ధ.. వ్యవస్థల మీద పెట్టలేదని విమర్శించారు. ప్రభుత్వానికి సరైన దృష్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. రెండు వారాల్లో బాధితులకు పరిహారం అందించాలని.. లేదంటే ధర్నాకు దిగుతామని డెడ్‌లైన్ విధించారు జగన్.