Vellampalli Srinivas: మాజీ మంత్రి వెల్లంపల్లికి కొత్త ఛాలెంజ్.. ఆ ఇద్దరు నేతలు సహకరిస్తారా? చుక్కలు చూపిస్తారా?

|

Apr 21, 2022 | 1:14 PM

ఆయనొక మాజీ మంత్రి..ఇప్పుడు వైసీపీలో జిల్లా పార్టీ అధ్యక్షుడు.ఇక పార్టీ రీజినల్ కోఆర్డినేట‌ర్ కూడా కొత్తవారే. అంతే కాదు జిల్లా పార్టీలో అసంతృప్తులూ ఎక్కువే.మరి మాజీ మంత్రికి అందరూ సహకరిస్తారా...?ఎన్ఠీఆర్ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి...?

Vellampalli Srinivas: మాజీ మంత్రి వెల్లంపల్లికి కొత్త ఛాలెంజ్.. ఆ ఇద్దరు నేతలు సహకరిస్తారా? చుక్కలు చూపిస్తారా?
Vellampalli Srinivas
Follow us on

NTR District : వైఎస్సార్ సీపీలో జిల్లా అధ్య‌క్షులు, రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ల‌కు కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు త‌ప్పేలా క‌న‌బ‌డ‌టం లేదు. కొత్త‌గా ఏర్ప‌డిన ఎన్టీఆర్ జిల్లాకు పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు(Vellampalli Srinivas) ను పార్టీ అధినేత వైఎస్ జగన్ నియ‌మించారు. ఇక ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల‌కు రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ గా చిల‌క‌లూరిపేట‌కు చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు ఇత‌ర నేత‌ల మ‌ధ్య ఇప్ప‌టికే అంత‌ర్గతంగా కొన్ని విభేదాలున్నాయి. ఇటీవ‌ల మంత్రిప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో సామినేని ఉద‌య‌భానుతో పాటు తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి కూడా అసంతృప్తి వ్య‌క్తం చేసారు. క‌నీసం పార్టీలో అయినా త‌న‌కు గౌర‌వం ద‌క్కుతుంద‌ని ఉద‌య‌భాను భావించారు. జిల్లా అధ్య‌క్షుడిగానో లేక రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ అయినా వ‌స్తుంద‌ని భావించారు ఉద‌య‌భాను. ఇప్ప‌టికే త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డానికి కార‌ణం జిల్లాలో ఉన్న కొంత‌మంది పార్టీ నేత‌ల వ‌ల్లే అని బాహాటంగానే ఆరోప‌ణ‌లు చేశారు. తీరా పార్టీ ప‌ద‌వి కూడా రాక‌పోవ‌డంతో ఆయ‌న మ‌రింత అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఇలాంటి ప‌రిస్థితుల్లో జిల్లా అధ్య‌క్షుడితో ఎంత‌వ‌ర‌కూ క‌లిసి ప‌నిచేస్తార‌నేది కూడా అనుమానంగా మారింది. ఇక మంత్రి ప‌ద‌విపై గంపెడాశ‌లు పెట్టుకున్న  ర‌క్ష‌ణ నిధి కూడా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత అనుచ‌రుల వ‌ద్ద అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో పాటు కొన్ని రోజులుగా మౌనంగానే ఉండిపోయారు.

ఈ ఇద్ద‌రు నేత‌ల నుంచి వెల్లంపల్లికి పెద్ద‌గా స‌హ‌కారం ఉండ‌క‌పోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తుంది. ఈ రెండు స్థానాలు కూడా వైసీపీకి కీల‌క స్థానాలు కావ‌డంతో వీరిని ఎలా క‌న్విన్స్ చేస్తార‌నేది చూడాలి. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వ‌హించిన‌ప్ప‌టికీ కేవ‌లం విజ‌య‌వాడ‌తో పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గంపైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టారు మాజీ మంత్రి వెల్లంప‌ల్లి. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి ఉన్న ఎమ్మెల్చే మ‌ల్లాది విష్ణు, తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిగా ఉన్న దేవినేని అవినాష్ నుంచి వెలంప‌ల్లికి స‌హ‌కారం బాగ‌నే ఉంటుంది. మైలవ‌రం ఎమ్మెల్యే గా ఉన్న వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కు కూడా వెల్లంపల్లితో రిలేష‌న్ బాగానే ఉండ‌టంతో ఇక్క‌డ ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

నందిగామ నుంచి ఎమ్మెల్యే,ఎమ్మెల్సీగా ఉన్న‌మొండితోక బ్ర‌ద‌ర్స్ కూడా పార్టీ కోసం క‌లిసి ప‌నిచేయ‌నున్నారు. మొత్తంగా ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు మిన‌హా మిగ‌తా నేత‌ల నుంచి వెల్లంపల్లికి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే స‌మ‌యంలో రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ గా ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఎప్ప‌టి నుంచో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశిస్తూ ఉన్నారు.ఉమ్మ‌డి కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌పై పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు.దీంతో ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్నా జిల్లా నేత‌ల‌ను ఎలా స‌మ‌న్వ‌యం చేస్తార‌నేది కూడా ప్ర‌శ్న‌గా మారింది.

పార్టీ ప‌రంగా జిల్లా అధ్య‌క్షుడిగా వెల్లంపల్లి ఉంటే,రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ గా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఉన్నారు.ఇక ఇంచార్జి మంత్రిగా తానేటి వ‌నితను నియ‌మించ‌డంతో పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని కూడా వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో కొత్త‌గా పార్టీ బాధ్య‌త‌లు తీసుకుంటున్న నేత‌లు..  వ‌ర్గ విబేధాల‌కు చెక్ పెట్టి పార్టీ బ‌లోపేతం దిశ‌గా ముందుకెళ్తారనేది పార్టీ వ‌ర్గాల టాక్.

-ఎంపీ రావు, విజయవాడ, టీవీ9 తెలుగు

Also Read..

Neha Shetty: సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్న డీజే టిల్లు బ్యూటీ.. నేహా ఫోజులకు ఫిదా అవుతున్న కుర్రకారు

Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏకంగా 45 రోజులు నిబంధనలు