
భారతీయ నృత్యరీతుల్లో అందరికీ ముందుగా గుర్తొచ్చేదీ భరతనాట్యం. మన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ.. మనస్సును ఉల్లాసపరుస్తుంది. భరతనాట్యం అంటే నృత్యకళ మాత్రమే కాదు. మన ఆలోచనలను భావరూపంలో వ్యక్తపరిచే కళాత్మక సాధనం. ఒక పదో తరగతి బాలిక భారతనాట్యంతో అద్భుత ప్రతిభ కనబరిచింది. శాస్త్రీయనృత్యంతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలిస్తూ కళాసేవ చేస్తోంది.
ఈ క్రమంలోనే నంధ్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మంగళవారం (సెప్టెంబర్ 2) నెల్లూరుకు చెందిన భవ్య హాసిని అనే భరతనాట్య కళాకారిణి దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వరకు నాట్య ప్రదర్శన నిర్వహించారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల కొండ ప్రాంతాన్ని భరతనాట్యం చేస్తూ ఎక్కి.. ఔరా అనిపించింది. చూపర్లను కట్టిపడేసింది.
నెల్లూరులో తాను10 వ తరగతి చదువుతున్నారని “మహా సంకల్పం” పేరిట పలు పుణ్యక్షేత్రాలను దర్శించి భరతనాట్య ప్రదర్శనలు చేస్తున్నట్లు భవ్య హాసిని తెలిపింది. ఇటీవల అరుణాచలం క్షేత్రంలో 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తూ… భరతనాట్య ప్రదర్శన చేసినట్లు తెలిపారు. అలాగే మాలకొండ, విజయవాడ ఇంద్రకీలాద్రి పైన కూడా భరతనాట్యం చేసి దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేరకు భరత నాట్యం చేస్తూ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు రావడం జరిగిందని వివరించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..