ఏపీలో న్యూస్‌ ఛానెల్స్‌ ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. హర్షం వ్యక్తం చేసిన NBF

|

Jun 25, 2024 | 12:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో న్యూస్‌ ఛానెల్స్‌ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో న్యూస్‌ఛానెల్స్‌ ప్రసారాలు పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

ఏపీలో న్యూస్‌ ఛానెల్స్‌ ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. హర్షం వ్యక్తం చేసిన NBF
Tv Channels
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో న్యూస్‌ ఛానెల్స్‌ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో న్యూస్‌ఛానెల్స్‌ ప్రసారాలు పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌-NBF హర్షం వ్యక్తం చేసింది. TV9, సాక్షి, 10టీవీ, NTV న్యూస్‌ ఛానెల్స్‌ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా న్యూస్‌ఛానెల్స్‌ని బ్లాక్‌ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబడుతూ చరిత్రాత్మక ఉత్తర్వు వెలువరించిందని NBF అభినందించింది.

ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పిందని NBF తెలిపింది. ఏపీలో రాజకీయ నాయకత్వం మారిన తర్వాత కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిళ్లు తీసుకొచ్చారని న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ ఆక్షేపించింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యం చాటిచెప్పిందని NBF వివరించింది. ఏపీ ప్రజలు విస్తృతమైన వార్తలు, అభిప్రాయాలను తెలుసుకోవడానికి న్యూస్‌ చానెల్స్‌ని తక్షణం పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించినట్లు NBF తెలిపింది.

— అంతేగాకుండా, ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ఛానెల్స్‌ ప్రసారాలు ఆపేయడం చట్టవిరుద్ధమనీ, అలాగే డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌-NBF గుర్తుచేసింది. కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారసంస్థలను న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ కోరింది. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులను పరిరక్షించడానికి హైకోర్టు ఆదేశం నాంది పలుకుతుంని ఆశిస్తున్నట్లు ఈ సంస్థ వ్యాఖ్యానించింది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, స్వేచ్ఛాయుత-స్వతంత్ర మీడియాను ప్రోత్సహించినందుకు ఢిల్లీ హైకోర్టుకు NBF అభినందనలు తెలిపింది.

పాత్రికేయుల హక్కులు, స్వేచ్ఛాయుత సమాచార వాతావరణాన్ని కొనసాగించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు NBF తెలిపింది. ఇక ముందు ఇలా ఛానెల్స్‌ ప్రసారాల నిలిపివేతలను అడ్డుకోడానికి ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని NBF విజ్ఞప్తి చేసింది. అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానెల్స్‌ పనిచేసే వాతావరణం కల్పించాలని NBF విన్నవించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..