అతడు ఒక భయంకరమైన నేరస్థుడు.. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేయడానికి కూడా వెనకాడడు, అతనిపై ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లాలో 16 కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిదేళ్ళుగా పోలీసులకు దొరక్కుండా వరుసగా దారి దోపిడీలు, రేప్, దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న నేరస్థుడికి నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందం నిందితుడు చెంచు దాసరి సుంకన్నను పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన చెంచు దాసరి సుంకున్న చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. పలు ఊర్లు తిరుగుతూ జీవనం సాగిస్తున్నాడు. 39 సంవత్సరాల చెంచు దాసరి సుంకన్న పట్టణ శివారు ప్రాంతాల్లో రాత్రిపూట తిరిగే జంటలపై దాడి చేయడం వారి వద్ద ఉన్న బంగారం నగదు దోచుకోవడం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అతని నైజం.
ఇప్పటి వరకు నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో 6 దాడి దోపిడి, దొంగతనాల కేసులు, బండి ఆత్మకూరు పోలీస్ స్టేషను పరిధిలో నాలుగు కేసులు, పాణ్యం స్టేషన్ పరిధిలో రెండు, మహానంది స్టేషన్ పరిధిలో ఒక కేసుతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మేడికొండ, ఎడ్లపాడు పోలీస్ స్డేషన్ పరిధిలో రేప్ కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఈ 16 కేసుల్లో తొమ్మిదేళ్ళుగా ముద్దాయిగా ఉన్న చెంచు దాసరి సుంకన్న ఒక్క కేసులో కూడా పోలీసుల నోటీసులు కానీ కోర్టులో కానీ హాజరు కాకపోవడం విశేషం. ఇన్ని నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముద్దాయిని పట్టుకోవడానికి నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అదిరాజ్ సింగ్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా సీసీఎస్ సీఐ సురేష్, ఎస్ఐ గంగయ్య, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, యేసుదాసు, గంగారం, మద్దిలేటి, వెంకటేశ్వర్లు ఒక టీమ్‌గా ఏర్పడి కొన్ని నెలలుగా ముద్దాయి కోసం గాలించారు.
చిట్టచివరికి నంద్యాల శివారులోని ఆటో నగర్ వద్ద ఉన్నట్లు గమనించి పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ముద్దాయి సుంకన్న స్వామి నాయక్ అనే కానిస్టేబుల్‌పై దాడి చేయడానికి ప్రయత్నించాడని, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలైనట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2.5 లక్షల విలువగల బంగారు ఆభరణాల స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో కృషి చేసిన కాని స్డేబుల్స్ చంద్రశేఖర్, యేసుదాసు, గంగారం, వెంకటేశ్వర్లును ఎస్పీ నగదు పారితోషికాలు ఇచ్చి ప్రోత్సహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి