
విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వ్యక్తిని నంద్యాల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నంద్యాలకు చెందిన ముల్లాఖాజా హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జిగా హిమబిందు పేరు తెరపైకి వచ్చింది. నాటి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు అంశం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత కొందరు వ్యక్తులు జడ్జికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి.
దీంతో జడ్జిలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై అడిషనల్ ఏజీ రాష్ట్రపతి భవన్‌కి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ సీరియస్ అయింది. జడ్జిలని కించపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టి కించపరిచిన నంద్యాలకు చెందిన ఐటీడీపీ నాయకుడు ముల్లాఖాజా హుస్సేన్‌ను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఖాజా హుస్సేన్‌పై 354K, 354B, 509, 67 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ముద్దాయిని కోవెలకుంట్ల కోర్టుకు తరలించామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి