
అపరిచితుడు ఇచ్చిన చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినులు, ఒక టీచర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది. నందికొట్కూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినికి స్కూల్ బయట ఒక గుర్తుతెలియని వ్యక్తి ఒక చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ బాలిక వాటిని స్కూల్లోని తన ఫ్రెండ్స్‌కు, పీఈటీ టీచర్‌కు ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
సాధారణ ఫుడ్ పాయిజనింగ్‌కు భిన్నంగా ఈ ఘటనలో బాధితుల్లో కొన్ని వింత లక్షణాలు కనిపించాయి. విద్యార్థినుల కనురెప్పలు నల్లగా మారిపోవడం.
తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, కొందరు విద్యార్థినులు మత్తులోకి జారుకోవడం వంటివి చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది.
ఈ ఘటన వెనుక కేవలం పాడైపోయిన చాక్లెట్లు మాత్రమే లేవని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో నందికొట్కూరులో ఒక రహస్య మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. విద్యార్థులను మత్తుకు బానిసలను చేయడానికి లేదా కొత్త రకమైన డ్రగ్స్‌ను పరీక్షించడానికి చాక్లెట్ల రూపంలో వీటిని సరఫరా చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మిగిలి ఉన్న చాక్లెట్ నమూనాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపారు. ఆ చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆ విద్యార్థినిని ఎక్కడ కలిశాడు? అనే విషయాలపై CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలను, చాక్లెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని పిల్లలకు అధికారులు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..