Visakhapatnam News: ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెందుర్తిలోని ఎస్‌ఆర్‌కే పురంలో 5 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికంగా ఉన్న 5 ఏళ్ల తేజ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండంలోని ఎస్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కనకరాజు, నారాయణమ్మ దంపతుల కుమారుడు తేజ గురువారం రాత్రి 7 గంటల నుంచి కన్పించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తేజ మృతదేహాన్ని శుక్రవారం లారీ యార్డులో గుర్తించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇది ప్రమాదమా..? హత్య..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. గత రాత్రి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
బాలుడి చేతిపై రెండు చిన్న గాట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మృతదేహం లభ్యమైన చోట పొదలు కూడా ఉన్నాయి. దీంతో బాలుడు మృతికి పాము కాటు కారణమా.? మరేదైనా కారణమా.? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యాక బాలుడి మృతికి కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తేజ మరణంపై తల్లిదండ్రులు కొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..