Guntur: పండక్కి ఉత్సాహంగా కుర్చీలాటలో పాల్గొంది.. కట్ చేస్తే.. చివరికి జరిగిందిదే

| Edited By: Ravi Kiran

Jan 16, 2025 | 1:13 PM

సంక్రాంతి సంబరాలు ఊరూవాడా అత్యంత వైభవంగా జరిగాయి. ఎప్పుడూలేని విధంగా ప్రతి పల్లెటూర్లోనూ వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ప్రతి ఏటా మహిళలకు ముగ్గులు పోటీలు పెడుతుంటారు. వీటితో పాటు కుర్చీలాటను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఆ గ్రామంలో జరిగిన కుర్చీలాట ఒక మహిళా ప్రాణం తీసింది. దీంతో గ్రామలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Guntur: పండక్కి ఉత్సాహంగా కుర్చీలాటలో పాల్గొంది.. కట్ చేస్తే.. చివరికి జరిగిందిదే
Representative Image
Follow us on

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరులో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా వివిధ ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా కుర్చీలాటను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. చాలా కోలాహాలంగా కుర్చీలాట జరుగుతుంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే ఆడవాళ్లు చాలామంది ఈ ఆటలో పాల్గొంటున్నారు. గ్రామానికి చెందిన కొండా లక్ష్మీ కూడా కుర్చీలాట జరుగుతోంది. కుర్చీల చుట్టూ తిరుగుతుండటంతో ఒక్కసారిగా కింద పడిపోయింది.

సాధారణంగా మహిళలు కుర్చీలాట ఆడుతున్నప్పుడు కళ్లు తిరిగి పడిపోతుంటారు. అలాగే లక్ష్మీ కూడా పడిపోయిందని భావించిన స్థానికులు వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అపస్మారక స్థితిలోనే ఉండటంతో అనుమానం వచ్చి ఫిరంగిపురం ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లారు. ఇదే సమయంలో కొంతమంది 108కి ఫోన్ చేశారు. మార్గం మధ్యలో ఆటోలో నుంచి మహిళను అంబులెన్స్ ఎక్కించారు. అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా, లక్ష్మీకి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. సంక్రాంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మహిళ చనిపోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు.