Andhra Prdaesh: సోదరులిద్దరిదీ ఒకే పార్టీ… ఒకే నియోజవర్గం… అయితేనేం, ఆధిప్యతం అగ్గిరాజేసింది. తమ్ముడేమో తగ్గేదేలె అంటున్నాడు.. అన్నయ్యేమో అంత లేదంటున్నాడు.. దీంతో, విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్నదమ్ముల(Kesineni Brothers) సవాల్… టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోసారి అన్నయ్య నానికి చెక్ పెట్టేలా కేశినేని చిన్ని పన్నుతున్న వ్యూహాలు… లోకల్ పాలిటిక్స్‌లో వేడి పుట్టిస్తున్నాయ్. ఇప్పటికే టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు కేశినేని నాని(Kesineni nani) అలియాస్ శ్రీనివాస్. అయితే, ఇప్పుడదే పార్లమెంట్ స్థానం పరిధిలో… ఆయన సోదరుడు కేశినేని శివనాథ్, అలియాస్ చిన్ని(Kesineni Chinni)… ఎక్కువగా హడావుడి చేస్తుండటం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే, పార్లమెంట్ పరిధిలో దూసుకుపోతున్న చిన్ని… పార్టీ ఇన్చార్జులతో, నాయకులతో విస్తృత భేటీలు నిర్వహిస్తున్నారు. అన్నయ్య కేశినేని నానికి దూరంగా ఉన్నవారిని తనకు దగ్గర చేసుకోవడంలో మరింత బిజీ అయ్యారు. నిజానికి ఈ పార్లమెంటు స్థానం కో ఆర్డినేటర్‌గా నానీయే ఉన్నారు. కానీ, చిన్ని చేస్తున్న హంగామా చూస్తుంటే.. అన్నయ్యకు చెక్ పెట్టేందుకు భారీ వ్యూహమే పన్నినట్టు కనిపిస్తోంది. బుద్దా వెంకన్న, బోండా ఉమా, వర్ల రామయ్య, తంగిరాల సౌమ్య, దేవినేని ఉమ వంటి నేతలతో… కేశినేని చిన్ని ప్రత్యేకంగా సమావేశం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అన్నయ్య నాని కోఆర్డినేటర్ గా ఉన్న విజయవాడ వెస్ట్ నేతలను… తనకు దగ్గర చేసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. కేశినేని నానికి చెక్ పెట్టేలా రాజకీయ వ్యూహం పన్నారన్న గుసగుసలు మొదలయ్యాయి. కేశినేని ఫౌండేషన్ ద్వారా చేయబోయే కార్యక్రమాల గురించి నేతలకు వివరిస్తున్నారు చిన్ని. అయితే, ఈ వ్యవహారం నాని వర్గానికి మింగుడు పడటం లేదని తెలుస్తోంది.
నిజానికి, కేశినేని బ్రదర్స్ మధ్య కయ్యాలు ఇప్పటివేం కాదు. ఎంపీ సోదరుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేశినేని చిన్ని… ఏకంగా అన్నయ్య స్థానానికే గురిపెట్టడం వివాదానికి బీజం వేసింది. తనకంటూ ఓ వర్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు చిన్ని. దీంతో, పాతసీసాలో కొత్త నీరులా తయారయ్యింది బెజవాడ టీడీపీ పరిస్థితి. అన్నదమ్ముల సవాల్ కాస్తా.. పార్టీలో పెను తుపాన్‌లా మారింది. ఎంపీగా నాని గెలుపులో కీలక పాత్ర పోషించిన చిన్ని.. ఇలా రివర్సవడం దుమారానికి కారణమైంది. విభేదాలు పెరగడంతో.. అన్నయ్య నానికి దూరం జరిగారు చిన్ని. కారుపై అతికించే ఎంపీ స్టిక్కర్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. ఆమధ్య చిన్నిపై విజయవాడ పటమట పోలీసులకు నాని ఫిర్యాదు చేయడం పెద్ద రచ్చకే దారితీసింది. దీంతో, ఇద్దరి మధ్యా అగ్గి రాజుకుంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్నకు కౌంటర్ ఇచ్చిన చిన్ని… సోదరుణ్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎంతలా గ్యాప్ పెరిగిందంటే.. నాని కుమార్తె వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగినా.. ఆ వేడుకకు చిన్ని హాజరుకాలేదు. అలా మలుపులు తిరుగుతున్న కేశినేని బ్రదర్స్ వ్యవహారాన్ని చల్లబరిచేందుకు హైకమాండ్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అధిష్టానం సైతం చిన్నికి ప్రిఫరెన్స్ ఇస్తోందన్న భావనలో నాని ఉండటంతో.. ఈ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది.
అన్నా దమ్ములు ఉప్పూనిప్పులా మారిన పరిస్థితుల్లో.. రాజకీయంగా చిన్ని దూకుడు పెంచడం వాతావరణం హీటెక్కింది. ఈసారి పోటీచేసే ఆలోచనలో నాని లేరనీ… అందుకే, నియోజకవర్గంపై చిన్ని పట్టుపెంచుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. తనకు లైన్ క్లియర్ కావడంతోనే… పార్టీలోని అగ్రనేతలతో పాటు, సామాజిక వర్గాలవారీగా నాయకులను కలుస్తున్నారు చిన్ని. పార్టీని బలోపేతం చేయటంతో పాటు ఎన్నికల్లో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..