వాళ్లంతా పర్యటకులు.. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు. ఊరు కాని ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రాన్ని దాటి.. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని బయలుదేరారు. సేఫ్ గా చేరుకున్నారు. ఒకచోట నుంచి మరోచోటకు ప్రయాణం ప్రారంభించారు. ఘాట్ రోడ్‌లో కారు వెళుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కారు బానేట్ నుంచి పొగలు వ్యాపించాయి. వేగంగా వెళ్తున్న కారు ఆపేసరికి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అమ్మో అంటూ గుండెలు పట్టుకున్నారు పర్యాటకులు. కారు దిగి పరుగు అందుకున్నారు.
అల్లూరి ఏజెన్సీలో పర్యాటకుల కారు ఒక్కసారిగా దగ్ధమైంది. పొగలు రావడాన్ని గుర్తించి కిందకు దిగిపోయారు పర్యాటకులు. ఆ వెంటనే మంటలు వ్యాపించి కళ్ల ముందే కారు పూర్తిగా కాలిపోయింది. ఎవరికి ఏమి కాకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల ప్రాంతానికి చెందిన అయిదుగురు పర్యాటకులు అల్లూరు ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు బయలుదేరారు. లంబసింగి వెళ్లి అక్కడ నుంచి.. అరకు బయలుదేరారు. వంజరి ఘాట్ రోడ్ లో వెళ్తుండగా.. కారులోంచి పొగలు రావడాన్ని గుర్తించారు ప్రయాణికులు. వెంటనే కారు ఆపి దిగిపోయారు. ప్రయాణికులు దిగిన మరుక్షణమే కారు పూర్తిగా క్షణాల్లో దద్ధమైంది. ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…