అమ్మను ఒంటరిగా పంపలేకపోయాడు.. మరణంలోనూ తోడొచ్చిన కన్నకొడుకు..! నిమిషాల వ్యవధిలో..
అమ్మకు అనారోగ్యం.. తన కళ్ల ముందే ఆమె పరిస్థితి విషమించడాన్ని ఆ హృదయం తట్టుకోలేకపోయింది. తల్లికి ఏమవుతుందోనన్న తీవ్ర మనోవేదన, గుండె కోతతో ఆ కన్న కొడుకు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి కన్నుమూశాడు. అటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ తల్లి ప్రాణం కూడా అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇలా నిమిషాల వ్యవధిలో తల్లి, కొడుకు ఇద్దరూ మృతి చెందిన అత్యంత దయనీయమైన, గుండెలవిసే ఉదంతం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ర్యాలి గ్రామానికి చెందిన చిట్టూరి అపర్ణ (42) గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. కోల్‌కతాలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె పెద్ద కుమారుడు సతీష్ (19)కు తల్లి ఆరోగ్యం బాగోలేదనే విషయం తెలిసింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అతడు రెండు రోజుల క్రితమే ఊర్లోని తన ఇంటికి వచ్చాడు. అప్పటినుంచి తల్లి పరిస్థితిని చూసి సతీష్ తీవ్ర మనోవ్యధకు, డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి కారణంగా అతడు రెండు రోజులుగా వాంతులు, విరోచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
ఇదిలావుంటే, శనివారం (జూలై 11) ఉదయం అపర్ణ ఆరోగ్యం ఒక్కసారిగా మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో బంధువులు, స్థానికులు కలిసి ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆటోలో రావులపాలెం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే, కన్నతల్లిని అపస్మారక స్థితిలో ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి సతీష్ తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన గుండె కోతతో ఒక్కసారిగా అతడికి గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అటు ఆటోలో ఆసుపత్రికి తరలిస్తున్న తల్లి అపర్ణ కూడా మార్గమధ్యంలోనే కన్నుమూసింది.
నిమిషాల వ్యవధిలోనే తల్లి, కొడుకు ఇద్దరూ మరణించడంతో ర్యాలి గ్రామంలో ఒకేసారి విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి కుటుంబంలో గతంలోనే ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. అపర్ణ భర్త వీరభద్రరావు గతంలో కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. అపర్ణ, వీరభద్రరావు దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, రెండో కుమారుడైన రాజేష్ గుప్తాను చిన్నప్పుడే సమీప బంధువులకు దత్తత ఇచ్చారు. అప్పటినుంచి అపర్ణ తన పెద్ద కుమారుడు సతీష్‌ను ఎంతో కష్టపడి చదివిస్తోంది. ఇప్పుడు ఒకేసారి తల్లి, అన్న ఇద్దరూ మరణించడంతో ఒంటరిగా మిగిలిన రెండో కుమారుడు రాజేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..