Power Charges: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. త్వరలో మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. ప్రకటన వచ్చేసింది..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్ ఛార్జీలపై ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. త్వరలోనే విద్యుత్ ఛార్జీలను తగ్గించనున్నట్లు ప్రకటన చేసింది. దీంతో రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు త్వరలో కరెంట్ బిల్లు తగ్గనుంది. యూనిట్‌పై 40 పైసల వరకు తగ్గనుందని తెలుస్తోంది.

Power Charges: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. త్వరలో మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. ప్రకటన వచ్చేసింది..
Power Charges

Updated on: Feb 06, 2026 | 9:06 AM

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. త్వరలో రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను కొంతమేర తగ్గించగా.. విడతల వారీగా తగ్గింపు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో విడతల వారీగా కరెంట్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో యూనిట్‌పై 13 పైసలు ఇప్పటికే తగ్గించి గృహ వినియోగదారులకు ఊరటనిచ్చింది. త్వరలో మరో విడత తగ్గింపును అమలు చేయనున్నట్లు గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనతో త్వరలోనే ఏపీ ప్రజలకు కరెంట్ ఛార్జీల భారం మరింతగా తగ్గనుందని తెలుస్తోంది.

ఎంత తగ్గుతుందంటే..?

యూనిట్‌పై 40 పైసలు తగ్గించాలనే టార్గెట్ పెట్టుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తొలి విడతలో 13 పైసలు తగ్గించగా.. త్వరలో మిగిలిన మొత్తం ఒకేసారి తగ్గించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల గృహ వినియోగదారులకు కరెంట్ బిల్లు మరింత తగ్గనుందన్నారు. త్వరలో ఈ తగ్గింపు ఉంటుందని స్పష్టతనిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలను పెంచలేదని, ఇంకా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ట్రూ అప్ ఛార్జీల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తాము అధికారంలో ఉండే ఈ ఐదేళ్ల పాటు ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని హామీ ఇచ్చారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనే హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పుడు అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

75 వేల కొత్త కనెక్షన్లు

ఇక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు సరఫరా చేసేందుకు కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇక రాష్ట్రంలో 75 వేల కొత్త వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేశామన్నారు. అలాగే కొత్తగా 200 సబ్‌స్టేషన్ల నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. కాగా తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం, టేకి గ్రామంలో నిర్మాణం పూర్తైన రెండు సబ్‌స్టేషన్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరెంట్ ఛార్జీల తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా ఛార్జీలు పెంచిందని ఆరోపించారు.