ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పరిటాల శ్రీరామ్ మధ్య మాటల మంట రాజుకుంది. సంబంధం లేని అంశాల్లో కొందరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ.. కామెంట్ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ముస్లిం సమాధుల తొలగింపు అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారాయన. ఇది పూర్తిగా మత పెద్దలు తీసుకున్న నిర్ణయమనీ. ఇది కూడా మాకు చెప్పే చేయాలని కొందరు అంటున్నారనీ. ఇది కరెక్టు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేతిరెడ్డి. సోషల్ మీడియా పోస్టింగులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ.. సీఐకి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. పట్టణంలో ఉన్న మసీదు కమిటీలన్నీ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని. ఇందులో తన ప్రమేయం ఉండదని అన్నారాయన.
గుమ్మడికాయ దొంగలెవరంటే.. ఎమ్మెల్యే భుజాలు తడుముకుంటున్నారనీ మండిపడ్డారు పరిటాల శ్రీరామ్. నెల రోజుల క్రితం జరిగిన ఘటనపై ఎమ్మెల్యే ఇప్పుడెందుకు మట్లాడారని ప్రశ్నించారు. ముస్లిం సమాధులను ఇష్టానుసారం కూల్చివేయడం ఏంటని నిలదీశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యిందనుకున్న సమయంలో ఎమ్మెల్యే చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో మీ పాత్ర లేకుంటే విజయవాడ నుంచి అంత హడావిడిగా ఎందుకొచ్చారని అడిగారు శ్రీరామ్.
ఖబరస్తాన్ విషయంలో తాను మొదటి నుంచి చెబుతున్నట్టు మసీదు కమిటీలన్నీ కలసి ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు శ్రీరామ్. ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే.. టీడీపీ తక్షణమే స్పందిస్తుందని హెచ్చరించారు టీడీపీ నేత పరిటాల.
మరిన్ని ఏపీ వార్తల కోసం..