Nimmala Rama Naidu: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే నిమ్మల ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆయన ఎడమ కాలికి స్వల్ప గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలం గుండుగోలను సమీపంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టడం తెలిసిందే.. ఈ మేరకు ఆయన పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు శుక్రవారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఆవేదనను తెలియజేసేందుకు, ఈ సమస్యను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించేందుకు సైకిల్‌పై అసెంబ్లీకి వెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర (Cycle Yatra) కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో భీమడోలు మండలంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తుండగా నిమ్మల కిందపడి కాలికి స్వల్ప గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్మల తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు.
సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలి.. నిమ్మల
టిడ్కో ఇళ్లు మేము 90 శాతం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం పది శాతం కూడా పూర్తి చేయలేదని నిమ్మల రామానాయుడు పేర్కొ్న్నారు. టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తే వైసీపీలో కదలిక వచ్చి రంగులు వేస్తారు, కానీ పనులు పూర్తి చేయడం లేదని ఆయన ఆరోపించారు. టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయాలని సైకిల్ యాత్రను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సైకిల్ యాత్రతో జగన్మోహన్ రెడ్డి కనువిప్పు కలగాలంటూ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మనసు ఇప్పటికైనా కరుగుతుందేమోనని ఆశిస్తున్నానంటూ నిమ్మల తెలిపారు. లబ్ధిదారులకు కేంద్రం లక్షా ఎనభై వేలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: