ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో.. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని హైదరాబాదేనని(Hyderabad) మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) అన్నారు. దాన్ని ఆధారంగా చేసుకునే న్యాయస్థానాలు మాట్లాడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమేనని అన్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఈ తీర్మానం చట్ట ప్రకారం జరగలేదని మంత్రి తెలిపారు. అందువల్ల విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదేనని స్పష్టం చేశారు. రాజధానిని గుర్తించాక పార్లమెంటుకు పంపించి, అక్కడ ఆమోదం పొందాకే చట్ట సవరణ చేస్తామని వెల్లడించారు.
గతంలోనూ అమరావతి రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులకే(Three capitals) కట్టుబడి ఉందని చెప్పారు. ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కావని వెల్లడించారు.
మరోవైపు మూడురాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని వెల్లడించింది. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Also Read
పరీక్షలో మెడికల్ స్టూడెంట్ హైటెక్ కాపీ.. వాడి టాలెంట్‌కు ఇన్విజిలేటర్ షాక్ !! వీడియో
Tamilnadu: బాత్‌రూమ్‌లో జారిపడ్డ మహిళ.. గొంతులో ఇరుక్కుపోయిన టూత్ బ్రష్.. డాక్లర్లు ఏం చేశారంటే..