తాను జైలులో లేనని ప్రజల గుండెల్లో ఉన్నానంటూ చంద్రబాబు సంతకంతో సర్క్యులేట్ అవుతోన్న లేఖ దుమారం రేపుతోంది. ములాఖాత్‌లో భాగంగా తనను కలిసిన కుటుంబసభ్యులకు ప్రజలనుద్దేశించి చంద్రబాబు లేఖ రాసి అందజేశారని ప్రచారం జరుగుతోంది. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల తన ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోందని తన రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖలో ఉంది. ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు కానీ తాను అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటానని చంద్రబాబు రాసినట్లుగా లేఖలో ఉంది. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని ఆరోపించడమే కాక ప్రస్తుత చీకట్లు తాత్కాలికమేనని, సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయని చంద్రబాబు లేఖలో ఉంది. త్వరలోనే బయటకొచ్చి ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆ లేఖలో రాసి ఉంది. త్వరలోనే బయటకొచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖలో ఉంది. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని లేఖలో ఉంది.
అంతకు ముందు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిశారు. చంద్రబాబు ఆరోగ్యం, వ్యక్తిగత, పార్టీ సంబంధిత వ్యవహారాలపై వారు చర్చించినట్లు సమాచారం. ములాఖత్ తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడకుండా నేరుగా బస శిబిరానికి వెళ్లారు. ఆ తర్వాతే చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. చంద్రబాబు లేఖకు కౌంటర్‌గా మంత్రి అంబటి రాంబాబు కూడా లేఖ రాశారు. ప్రజలకు బహిరంగ లేఖ అంటూ సానుభూతి డ్రామాకు చంద్రబాబు తెరలేపారన్నారు అంబటి. తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు అంబటి. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా, నాలుగైదు నిజాలు చెబుతారేమో అనే ఆశను నిరాశగా మారుస్తూ చంద్రబాబు ఉత్తరం రాశారన్నారు అంబటి. జైలు నుంచి లేఖను ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రొటోకాల్స్‌లోకి తాను వెళ్లటం లేదన్నారు అంబటి. చంద్రబాబు పేరిట టీడీపీ నేతలే ఆ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారని చెప్పారాయన.
మరోవైపు చంద్రబాబు సంతకంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న లేఖతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని రాజమండ్రి జైలు అధికారులు స్పష్టం చేశారు. జైలు రూల్ ప్రకారం ముద్దాయిలు సంతకం చేసిన లేఖ విడుదల చేయాలంటే తాము పరిశీలించి స్టాంప్ వేసి సంబంధిత కోర్టులకు లేదా ప్రభుత్వ శాఖలకు, కుటుంబ సభ్యులకు పంపుతామని స్పష్టం చేశారు జైలు అధికారులు. లేఖ వివాదం మున్మందు మరింత ముదిరే అవకాశముంది.
జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశ ద్రోహమా? నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాతో వీడియోలు తీసి ఇచ్చినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా? చెయ్యని తప్పుకి 44 రోజులుగా జైలులో బంధించారు. ములాఖత్ లో భాగంగా ఆయన ప్రజలతో చెప్పాలి అనుకున్న అంశాలు అన్ని మాతో పంచుకున్నారు. ప్యాలెస్ ఆదేశాలకు భయపడి లేఖ రాయడం కూడా నేరం అన్నట్టు పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేయడం రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోంది. నాలుగు గోడల మధ్య నిర్బంధించినా జగన్ కి కక్ష తీరలేదు. ఆఖరికి ఆయనకు లేఖ రాసే హక్కు కూడా లేదంటూ వేధిస్తున్నారు.
మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..