Mystery Disease: ఏదో కుట్ర జరుగుతోంది.. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి ఆళ్ల నాని..

|

Jan 22, 2021 | 12:41 PM

Mystery Disease: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి ఘటనపై..

Mystery Disease: ఏదో కుట్ర జరుగుతోంది.. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి ఆళ్ల నాని..
Follow us on

Mystery Disease: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి ఘటనపై స్పందించిన ఆయన.. ఇందులో ఏదో కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని భీమడోలు, దెందులూరు ప్రాంతాల్లో ప్రజలు వింత వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని.. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వింత వ్యాధి విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేవాలయాల్లో దాడులపై పార్టీల ప్రమేయం ఉన్నట్లు తేలిందని ఉటంకించిన ఆయన.. అదే తరహాలో వింత వ్యాధిపైనా అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థంతోనే కొందరు ఈ కుట్రకు తెరలేపారనే అనుమానం కలుగుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉంటే.. పశ్చిమగోదావరి జిల్లాలో గంట గంటకూ వింత వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భీమడోలు మండలం పూళ్లలో బాధితుల సంఖ్య 36కి చేరింది. ఇక కొమరేపల్లిలో వింత వ్యాధితో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి బాధితులు కిందపడిపోతున్నారు. ఏలూరు తరహా లక్షణాలతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నాలుగు రోజుల్లోనే 50కి పైగా వింత వ్యాధి కేసులు నమోదు అయ్యాయి. భీమడోలు, దెందులూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య 54కి చేరింది. ఇవాళ పొలాల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు వింత వ్యాధితోనే మృతి చెందారని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అయితే పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా వారి మృతికి కారణాలేంటనేది గుర్తిస్తామని అధికారులు తెలిపారు. కాగా, బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. మంత్రి ఆళ్లనాని పరామర్శిస్తుండగానే ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పరిస్థితి విషమంగా ఉండటంతో.. జిల్లా అధికార యంత్రాంగంతో వింత వ్యాధిపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Also read:

Sasikala Health Updates: క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం.. పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స

Bird Flu Alert: బర్డ్‌ ఫ్లూ సోకకుండా ఉండాలంటే ఇలా చేయండి… కీలక సూచనలు చేసిన ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ..