Maoist Martyrs Week: అడవిలో శాంతిస్థూపాలు దేనికి సంకేతం..! మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల్లో హాట్ టాపిక్

|

Jul 30, 2021 | 12:45 PM

Maoist Martyrs Week: ఇప్పటివరకు వారోత్సవాల్లో మావోయిస్టులు అమరవీరులకు నివాళులర్పించేవారు. అరుణవర్ణంలో అమరవీరుల పేరుతో స్థూపాలు నిర్మిస్తుంటారు. అయితే.. ఈసారి కాస్త డిఫరెంట్‌గా మావోయిస్టు ఖిల్లాల్లో శాంతి స్థూపాలు దర్శనమిచ్చాయి.

Maoist Martyrs Week: అడవిలో శాంతిస్థూపాలు దేనికి సంకేతం..! మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల్లో హాట్ టాపిక్
Maoist
Follow us on

Maoist Martyrs Week: విశాఖ మన్యంలో మావోయిస్టు వారోత్సవాల్లో ఈ సారి ఓ విశేషం చోటు చేసుకుంది. ఇప్పటివరకు వారోత్సవాల్లో మావోయిస్టులు అమరవీరులకు నివాళులర్పించేవారు. అరుణవర్ణంలో అమరవీరుల పేరుతో స్థూపాలు నిర్మిస్తుంటారు. అయితే.. ఈసారి కాస్త డిఫరెంట్‌గా మావోయిస్టు ఖిల్లాల్లో శాంతి స్థూపాలు దర్శనమిచ్చాయి. అంటే ఇవి మావోయిస్టులు ఏర్పాటు చేసినవి కాదు..! మావోయిస్టుల చేతిలో ఇన్‌ఫార్మర్ల నెపంతో హత్యకు గురైన ఆదివాసీల పేర్లతో వారికి నివాళులర్పించేలా ఈ స్థూపాలు ఏర్పాటుచేశారు. అమరవీరుల వారోత్సవాల్లో మావోయిస్టు వ్యతిరేక స్థూపాలు దేనికి సంకేతం..?!

ఆంద్రా ఒడిశా సరిహద్దులో ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు మావోయిస్టులు నిర్వహిస్తుంటారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టులకు ఈ వారంలో నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం వారోత్సవాల ముందు నుంచి.. ఏవోబీలోని మారుమూల ప్రాంతాల్లో స్థూపాలను నిర్మిస్తుంటారు. పాత స్థూపాలకు అరుణ వర్ణంలో రంగులు వేసి వాటిపై అమరవీరుల పేర్లు రాసి వారికి నివాళులర్పిస్తుంటారు మావోయిస్టులు. ఈ సారి కూడా ఏవోబీలోని ఇంటీరియర్‌ ఏరియాల్లో మావోయిస్టులు ఇప్పటికే స్థూపాలను ఏర్పాటు చేశారు.

ఏటా జరిగే ఈ అమరవీరుల వారోత్సవాల్లో అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు.. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి గిరిజనులకు మోటివేట్‌ చేస్తుంటారు మావోయిస్టులు. ఉనికిని చాటుకునేందుకు దాడులు, ఇన్‌ఫార్మ నెపంతో ప్రజాకోర్టులో శిక్ష పేరుతో గిరిజనులు హతమారుస్తుంటారు మావోయిస్టులు. దీనికి తోడు.. గిరిజనుల దళంలో రిక్రూట్‌ మెంట్ చేసేలా ప్లాన్లు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ సారి కూడా మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చారు. అమరవీరులకు నివాళులర్పించాలని కోరారు. ఓ ఆడియో మెసేజ్‌ను కూడా మావోయిస్టులు విడుదల చేశారు.

Maoist Issue

తీగలమెట్ట ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు సభ్యులను కోల్పోవడం రామగూడ ఎన్‌కౌంటర్‌ తరువాత మావోయిస్టులు భారీ నష్టాన్ని చవిచూశారు. దీనికి తోడు.. భద్రతా బలగాల నిఘా పెరగడం, ఏవోబీతో పాటు విశాఖ మన్యంలో కీలకంగా వ్యవహరించే డీసీఎం చిక్కుడు చిన్నారావు అలియాస్ సుధీర్‌ దళం నుంచి బయటకు రావడం కూడా మావోయిస్టులకు మైనస్‌. దీంతో.. ఈసారి వారోత్సవాల్లో మావోయిస్టులు కాస్త స్తబ్దుగా ఉన్నారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఏవోబీలో హై అలర్ట్‌ ప్రకటించి.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపి అడవిని జల్లెడపడుతున్నారు. ఈ సారి ఏకంగా డ్రోన్లను రంగంలోకి దింపి నిఘా పెంచారు పోలీసులు. గ్రామాల్లో శాంతి ర్యాలీలునిర్వహించి గిరిజనుల్లో చైతన్యం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యుల సంచారం పెరిగిందని నిఘా వర్గాల సమాచారంతో అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు గిరిజనులకు సూచిస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరవీరుల వారోత్సవాల్లో అరుణ వర్ణ స్థూపాలకు బదులు శ్వేతవర్ణంలో శాంతిస్థూపాలు దర్శనమివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల్లోనే వారికి వ్యతిరేకంగా గళం వినిపించడం, స్థూపాలు నిర్మించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గ్‌ గా మారింది. అమరవీరుల వారోత్సవాల్లో మావోయిస్టులు.. ప్రకటనలు చేయడం, పోస్టర్లు వేయడం సర్వసాధారణం. కానీ.. ఈ సారి వారోత్సవాల్లో మావోయిస్టులు స్తబ్దుగా కనిపించారు. దీనికి తోడు.. మావోయిస్టుల వ్యతిరేకంగా మన్యంలో శాంతిస్థూపాలు వెలిశాయి. జి మాడుగుల మండలం మద్దిగరువు, పెదబయలు మండలం బొంగరం, ముంచంగిపుట్టు మండలం కుమడ ప్రాంతాల్లో ఈ శాంతి స్థూపాలు దర్శనమిచ్చాయి. ప్రధానంగా ‘ గిరిజనాభివృద్ధి కోసం మావోయిస్టులను ఎదరించి వారి చేతిలో హతమైన గిరిజన సోదరులకు జోహార్లు” అంటూ ఆ స్థూపాలపై నినాదాలు రాశారు. తెలుపువర్ణంలో ఈ స్థూపాలు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోనే దర్శనమివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

శాంతి స్థూపాలను ఏర్పాటు చేసి.. దానిపై మావోయిస్టు వ్యతిరేక నినాదాలతో పాటు.. మావోయిస్టుల చేతిలో హతమైన గిరిజనుల పేర్లను రాశారు. గిరిజనులు సింద్రి కార్ల, కొందుమూరు రామ్మోహన్‌, కిల్లో రాంబాబు, గొంపలోవ శ్రీను, వంతల సత్యారావు, బచ్చల బాలకృష్ణ, పాంగి సత్తిబాబు, గెమ్మెలి భాస్కరరావు, గెమ్మెలి సంజీవరావులతో పాటు మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌ మైన్‌ బ్లాస్ట్‌లో మృతిచెందిన అజయ్‌కుమార్‌, మోహనరావుల పేర్లను తేదీలతో సహా స్పష్టంగా ఆ స్థూపాలపై పెట్టి గిరిజన సోదరులకు జోహార్లు అంటూ నినాదాలు చేర్చారు.

మొత్తమ్మీద అమరవీరుల వారోత్సవాల్లో ఆదివాసీపోలీసుల ప్రయత్నాలు ఫలించినట్టు అనిపిస్తోంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల్లో పోలీసులు చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు ఫలించేలా ఈ శాంతి స్థూపాలు ఈ సారి దర్శనమివ్వడం ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చకు దారితీసింది. గిరిజనుల్లో మావోయిస్టులపై పెరిగిన వ్యతిరేకతకు ఇదొక ఉదాహరణగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

(ఖాజా, టీవీ9 తెలుగు, విశాఖపట్నం)

Also Read..

గుంటూరు జిల్లాలో మరణాల వెనుక మిస్టరీ ఏంటి..? చిక్కుముడిగా మారిన ప్రశ్నలు..

రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ని నియమిస్తారా..! మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఏంటి..?