తన ఆటోలో ఎక్కించుకున్న ప్రయాణీకులను వారి గమ్యస్థానాల్లో దించేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఎప్పటిలానే తన ఆటోను ఓసారి పరిశీలించాడు. సీట్ ముందు, వెనుక భాగంలో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశాడు. ఇంతలో అతడికి ఒక బ్యాగ్ కనిపించింది. ప్రయాణీకులు ఎవరైనా తమ బ్యాగ్‌ను మర్చిపోయి ఉండొచ్చునేమోనని అనుకున్నాడు. ఆ బ్యాగ్‌లో ఏమున్నాయో చూసేందుకు ఓపెన్ చేయగా.. అతడి కళ్లు జిగేలుమన్నాయి. సీన్ కట్ చేస్తే..! సరాసరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అందులో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
గుంటూరులోని మంగళగిరికి చెందిన సునీల్ కుమార్ అనే ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. శుక్రవారం కిరాయి నిమిత్తం వివాహానికి విజయవాడ వచ్చిన చెన్నైకి చెందిన దంపతులను తన ఆటో ఎక్కించుకుని వారి గమ్యస్థానంలో దించాడు సునీల్. వారు కాస్తా అటో దిగే సమయంలో ఆ బ్యాగ్‌ను మర్చిపోయారు. ఇక సునీల్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆటోలో బ్యాగ్ ఉండటాన్ని గుర్తించాడు. బ్యాగ్‌లో నగదు ఉండటంతో మంగళగిరి పోలీసులకు బ్యాగ్ అప్పగించాడు. వెంటనే బ్యాగ్‌లో ఉన్న ఐడీ కార్డు ద్వారా ఆ దంపతులకు సమాచారం అందించారు పోలీసులు. బ్యాగ్‌లో సుమారు రూ. 4 లక్షలు విలువ చేసే బంగారు నగలు ఉండగా.. మర్చిపోయిన తమ బ్యాగ్ తిరిగి దక్కడంతో ఆ దంపతులు సంతోషపడ్డారు. నిజాయితీగా బ్యాగ్ అప్పగించిన డ్రైవర్‌కు రూ. 10 వేలు అందజేశారు.