Andhra Pradesh: సినిమా స్టైల్‌లో వ్యక్తి కిడ్నాప్.. అంతే ఫాస్ట్‌గా పోలీసుల రియాక్ట్.. కట్‌ చేస్తే..!

ఒక్కసారిగా సినిమా స్టైల్లో మహీంద్రా థార్‌ వాహనం రోడ్డుపైకి దూసుకొచ్చింది.. అందులో నుంచి బిలబిలమంటూ నలుగురు వ్యక్తులు దిగారు.. అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిని పట్టుకుని ఈడ్చుకెళ్ళి వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు ఎవరో కారులో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Andhra Pradesh: సినిమా స్టైల్‌లో వ్యక్తి కిడ్నాప్.. అంతే ఫాస్ట్‌గా పోలీసుల రియాక్ట్.. కట్‌ చేస్తే..!
Kidnap In Markapuram District

Edited By:

Updated on: Jan 20, 2026 | 9:08 PM

ఒక్కసారిగా సినిమా స్టైల్లో మహీంద్రా థార్‌ వాహనం రోడ్డుపైకి దూసుకొచ్చింది.. అందులో నుంచి బిలబిలమంటూ నలుగురు వ్యక్తులు దిగారు.. అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిని పట్టుకుని ఈడ్చుకెళ్ళి వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు ఎవరో కారులో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతే ఇక పోలీసులు ఛేజింగ్‌ మొదలెట్టారు. చివరకు థార్‌ వాహనాన్ని ఆపి నలుగురు కిడ్నాపర్లను, కిడ్నాప్‌కు గురైన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. నగదు లావాదేవీల వ్యవహారమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు తేల్చారు.

మార్కాపురం జిల్లాలో పట్టపగలే కిడ్నాప్ కలకలం రేపింది. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డులో బాల అంకయ్య అనే వ్యక్తిని మహీంద్ర థార్‌ వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రాచర్ల ప్రాంతంలోని కంభం రహదారిలో కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం వల్లే బాల అంకయ్య అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు.

బాధితుడు చెప్పిన వివరాల మేరకు గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామానికి చెందిన బండారు నాగ మోహన్ రావుకు బాల అంకయ్యకు మధ్య నగదు లావాదేవీల వివాదం ఉంది. విషయం కోర్టు దాకా వెళ్ళింది. గతంలో పెద్దల మధ్య కూడా పంచాయతీ జరిగింది. బాల అంకయ్య 4 లక్షల రూపాయల వరకు అప్పు పడగా, అందులో లక్ష రూపాయలు అప్పు చెల్లించినట్లు కిడ్నాప్‌కు గురైన బాల అంకయ్య పోలీసులకు తెలిపాడు. కోర్టులో వివాదం ఉండగా నాగ మోహన్ రావు కుమారుడు మహేష్, అతనితో పాటు వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి తనను కిడ్నాప్ చేసినట్లుగా బాధితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే తీసుకున్న అప్పు విషయం మాట్లాడదామని బాల అంకయ్యను తీసుకెళ్లామని నిందితులు చెబుతున్నారు. పూర్తి విచారణ చేసి అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన తర్వాత ఇది కిడ్నాప్ ఘటనా.. కాదా.. ? అనే విషయాన్ని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు బాధితుడి వాంగ్మూలం, నిందితుల వివరణ, అలాగే వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం నిజానిజాలు తేలిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..