అల్లూరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పీతల వేటకు వెళితే ప్రాణాలు గల్లంతయిన ఘటన హుకుంపేట మండలంలో చోటు చేసుకుంది. దీంతో ఆ పేద కుటుంబం రోడ్డున పడినట్టయింది. బారాపల్లికి చెందిన 30 ఏళ్ల బోనగిరి రవికుమార్.. వాగులు, గెడ్డల్లో అప్పుడప్పుడు చేపలు పడుతూ ఉంటాడు. ఎప్పటిలాగే బుధవారం మరో ఇద్దరితో కలిసి రవికుమార్ చీడిపుట్టు గెడ్డకు వెళ్లారు. అక్కడ పీతలు పట్టేందుకు అంతా సిద్ధమయ్యారు. వేట ప్రారంభించారు. చేతికి చిక్కినట్టు చిక్కి ఓ పీత తప్పించుకుంది. దానిని పట్టుకునే క్రమంలో రవికుమార్ ప్రమాదవశాత్తు గెడ్డలో మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలోకి వెళ్లిపోయాడు.
రవికుమార్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికులు వచ్చినా ఎటువంటి ఫలితం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గజ ఈతగాళ్లు రంగాల్లోకి దిగారు. ముమ్మరంగా గాలించారు. చివరకు రవికుమార్ మృతదేహం గెడ్డలో బయటపడింది. కాగా, రవికుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తోంది. ఈత రాకుండా గెడ్డలు, వాగులు పరివాహ ప్రాంతాల్లో నీటిలో వేటకు వెళ్లడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.