Andhra: పొలానికి వెళ్తే అతని సుడి తిరిగిపోయింది.. ఏకంగా 30 లక్షల విలువైన
లక్ మారింది. ఫేట్ తిరిగిపోయింది. పొలంలో దొరికిన ఓ రాయి అతని జీవితాన్ని మార్చేసింది. వర్షాలు పడుతూ ఉండటంతో కర్నూలు జిల్లాలోని మద్దికెర, తుగ్గలి మండలాల పరిధిలోని గ్రామాల పరిధిలో వజ్రాల అన్వేషణ జోరుగా సాగుతుంది. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి.. తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు.

వర్షాలు పడుతూ ఉండటంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జనం తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. తాజాగా మద్దికెర మండలం పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ వద్ద నివాసం ఉండే.. ఒక వ్యక్తి పంట పండింది. ఆదివారం పొలంలో వెతకగా.. ఏకంగా రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికిందని సమాచారం. ఆ ప్రాంతానికే వచ్చి ఓ వ్యాపారి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారట. మార్కెట్‌లో ఆ వజ్రం విలువ రూ.60 లక్షల దాకా ఉంటుందని చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ.. పోలీసులు, రెవిన్యూ అధికారులకు ఉప్పు అందడంతో ఆరా తీస్తున్నారు. ఇటీవల పెరవలిలో కూడా ఒకరికి వజ్రం దొరికగా.. దానిని రూ.1.5 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది.
వజ్రాలు వేట సాగించేవారికి.. దాని విలువ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఒకవేళ ఉన్నా ఎక్కువసేపు దాన్ని తమ వద్ద ఉంచుకోరు. పోలీసు వారికి తెలిస్తే అది స్వాధీనం చేసుకుంటారనే భయంతో వెంటనే దాన్ని అమ్మేస్తూ ఉంటారు. అందుకే విక్రయాలు హస్యంగా సాగుతాయి. వ్యాపారులు అయితే అక్కడే మకాం వేసి.. పొలాల వద్ద వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వజ్రాల వేట కోసం జనం కర్నూలు పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటారు. వజ్రం దొరికితే జీవితం మారిపోతుందని ఆశపడుతూ ఉంటారు. అక్కడే నివాసం ఉండటం, వండుకోవడం చేస్తూ రోజుల తరబడి వజ్రాల అన్వేషణలో మునిగిపోతూ ఉంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




