మా ఇంట్లో కుక్క పిల్ల కనిపించడం లేదు.. మా ఇంట్లో పిల్లి ఎక్కడికో వెళ్లింది.. ఇలాంటి స్టోరీలు మనం ఇప్పటి వరకు చూశాం. ఇది మరో కేసు.. అంతకు మించిన స్థాయిలో పోలీసులను చుట్టేసింది. ఇప్పుడో విచిత్రమయిన కంప్లైంట్ పోలీసులకు అందింది. తన తెల్ల కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ చిత్రమయిన కంప్లైంట్ చూసిన పోలీసులకు తలనొప్పి వచ్చింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వెంకటాద్రి. అల్లారుముద్దుగా పెంచుకున్న జాతి కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పోలీస్ స్టేషన్లో గత నెల 29 వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు వెంకటాద్రి. ఆలస్యంగా వెలుగు చూసిన అరుదైన ఫిర్యాదు చూసి జనం నవ్వుకుంటుంటే.. ఈ కోడిపుంజు దొంగను ఎలా పట్టుకోవాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు పోలీసోళ్లు.
వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి కోడిపుంజు తప్పిపోయిందంటూ వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు. అతడిని ఓదార్చలేక పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. ఏడాదిన్నర క్రితం తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి జాతి పుంజులను తెచ్చుకొని పెంచుతున్నాడు. అందులో అన్ని పుంజులు చనిపోగా.. ఒక్కగానొక్క పుంజు మాత్రమే బతికింది. దీంతో ఆ పుంజును ఎంతో ఇష్టంగా.. ప్రేమగా పెంచుకుంటున్నాడు. అయితే గత మూడు రోజుల క్రితం దొంగలు వీరి వద్ద ఉన్న కోడి పుంజును గుట్టు చప్పుడు కాకుండా దొంగిలించుకుపోయారు. దాని వీలువ రూ. 9 వేల వరకు ఉంటుందంటున్నారు.
ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ తమిళ కోడి పుంజును దొంగిలించారని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పెద్దవంక గ్రామ పరిసరాల్లో తరచూ కోడిపందాలు జరుగుతుంటాయని.. పందాల కోసమే దొంగలు అపహరించి ఉండొచ్చని అనుమానిస్తూ ఫిద్యాదులో పేర్కొన్నాడు. అయితే ఇందుకు భిన్నంగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్ళారని ఫిర్యాదులో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. నా కోడి పుంజు నాకు తెచ్చి ఇవ్వాలని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు వేడుకుంటున్నాడు. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్ఐ బిందు మాధవి మీడియాకు తెలిపారు. మీకు ఆ కోడిపుంజు కనిపిస్తే పోలీసులకు చెప్పి పుణ్యం కట్టుకోండి. వాళ్ళ తలనొప్పి తగ్గించండి.