AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారని భావించి పక్కింటి మహిళ దాడి! ఆ తర్వాత సీన్ ఇదే..

మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఓ భర్త.. భార్యను ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడసాగాడు. ఇంతలో పక్కింట్లోని మహిళకు వీరి గొడవ చెవిన పడింది. కాసేపు ఓపిక వీరి గొడవ వినిన మహిళ ఆ తర్వాత తన బంధువులకు ఫోన్ చేసి అందరినీ ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారని భావించి పక్కింటి మహిళ దాడి! ఆ తర్వాత సీన్ ఇదే..
Family Dispute In Palnadu
Srilakshmi C
|

Updated on: Apr 25, 2026 | 6:22 AM

Share

నరసరావుపేట, ఏప్రిల్‌ 25: ఓ పతి దేవుడు ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో తూలుతున్న అతగాడు భార్యను చెడామడ తిట్టేశాడు. ఈ క్రమంలో ఈ తిట్లు కాస్తా పొరుగింటి మహిళ చెవిన పడ్డాయి. అంతే అతడు తననే దూషిస్తున్నాడని అపార్థం చేసుకున్న సదరు పక్కింటి మహిళ.. ఇరుగు పొరుగు వారిని పిలిపించి నానాయాగి చేసింది. ఈ విచిత్ర ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

పల్నాడు జిల్లా దాచేపల్లి లైబ్రరీ సెంటర్‌లో కాపురం ఉంటున్న పఠాన్‌ రాజుబుడే అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న రాజుబుడే గురువారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాజుబుడే భార్యతో గొడవపడ్డాడు. గొడవ కాస్త ముదిరి పాకానపడటంతో అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించాడు. అలికిడికి ఇంటి పక్కన ఉండే మరో కుటుంబానికి చెందిన మహిళ వీరి గొడవను వినసాగింది.

పొరుగింటి వారు తననే తిడుతున్నాడని భావించిన సదరు మహిళ తమ బంధువులకు సమాచారం ఇచ్చి.. అందరినీ పిలిపించింది. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న మహిళ బంధుజనం హుటాహుటిన వచ్చి రాజుబుడేతో గొడవకు దిగారు. వారికి విషయం చెప్పేలోపే కర్రలు, రాడ్లతో రాజుబుడేపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో రాజుబుడే తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. గాయపడిన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో అసలు సంగతి తెలిసి నాలుక కరచుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us