Cockfight: కోనసీమలో మొదలైన కోడిపందాలు.. పోలీసులు శీత కన్ను.. చేతులు మారనున్న కోట్లాది రూపాయలు

|

Jan 14, 2022 | 2:02 PM

Makar Sankranti 2022 Cockfight: ఆంధ్రలో పెద్ద పండగ సంక్రాంతి(Pongal) సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. సంక్రాంతి పండగ అంటే.. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు..

Cockfight: కోనసీమలో మొదలైన కోడిపందాలు.. పోలీసులు శీత కన్ను.. చేతులు మారనున్న కోట్లాది రూపాయలు
Cock Fighting In Konaseema
Follow us on

Makar Sankranti 2022 Cockfight: ఆంధ్రలో పెద్ద పండగ సంక్రాంతి(Pongal) సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. సంక్రాంతి పండగ అంటే.. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు (Cock fighting), ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరేద్దుల ఆటలు వంటి సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. సంక్రాంతి రోజుల్లో గోదావరి జిల్లాల్లో కనిపించేది కోడి పందాలు. నెల రోజుల ముందునుంచే పందెంరాయుళ్లు తమ కోళ్లకు కత్తులు కట్టి బరిలో దింపడానికి రెడీ అయిపోతుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు చోట్ల కోడి పందాల బరులను నిర్వాహకులు రెడీ చేశారు. కోనసీమ(Konaseema) వ్యాప్తంగా గ్రామ గ్రామాన కోడి పందాలు, గుండాట బరులు వెలిశాయి.

కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికొన, పల్లంకుర్రు మండలాల్లో సంప్రదాయం ముసుగులోనిర్వాహకులు కోళ్ళకు కత్తి కట్టి బరిలోకి దింపుతున్నారు. అయితే నిన్నటి వరకూ పోలీసులు కోడి పందాలు మొదలు పెడితే.. ఊరుకోమని.. కేసులు పెడతామంటూ నిన్నటి వరకూ ఓ రేంజ్ లో హడావిడి చేశారు. పందెం రాయుళ్ళకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చారు. అయితే ఇప్పుడు కోనసీమలోని పలు ప్రాంతాలలో భారీగా కోడిపందాలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడంలేదు.

కోనసీమలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం, అల్లవరం,ఉప్పలగుప్తం,రావులపాలెం,రాజోలు మండలాల్లో కోడిపందాల బరులు భారీగా వెలశాయి. ఇక గత నాలుగేళ్ళుగా ఐ.పోలవరం మండలంలో ఫ్లడ్ లైట్లు, డ్రోన్ కెమెరా చిత్రీ కరణ నడుమ కోడి పందాలను హైటెక్ పద్దతిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంప్రదాయ క్రీడల పేరుతో అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రామగ్రామాన కోడిపందాలు, గుండాటలు జరుగుతున్నాయి. పందాల ముసుగులో కోట్లాది రూపాయిలు చేతులు మారనున్నాయి. జోరుగా బెట్టింగ్ బంగార్రాజులు కోళ్లతో రెడీ అయ్యారు. ఇక గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాలను చూడడానికి ఆంద్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు తదితర ప్రాంతల నుంచి భారీ సంఖ్యలో పందెంరాయుళ్లు వస్తారు.