AP News: చేపను కొరికి చంపేందుకు యత్నించిన మహిళ.. అది గొంతులోకి జారుకుంది.. ఆ తర్వాత
ఆమెకు చేపలు పట్టడం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే. కానీ చేసిన చిన్న పొరపాటు.. ఆమెను ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్లింది. బతికున్న చేప గొంతులో ఇరుక్కుపోయింది. ఆపై ఏమైందో తెలుసుకుందాం పదండి.

తోటి మహిళలతో కలసి ఆమె దగ్గర్లోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లింది. ఓ చేప చిక్కడంతో.. దాన్ని చంపేందుకు నోట్లో వేసుకుంది. అంటే కొరికి చంపాలనుకుందన్నమాట. కానీ ఇక్కడే సీన్ రివర్సయ్యింది. ఆ చేప ఠక్కున జారిపోయి.. గొంతులో ఇరక్కుపోయింది. ఇంకేముంది ఊపిరి పోయినంత పనైంది. బతికే ఉన్న ఆ చేప లోనికి వెళ్లక.. బయట రాక.. ఆ మహిళను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా కుంజవారిగూడెం గ్రామంలో వెలుగుచూసింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కుంజవారిగూడెం గ్రామంలో నివసిస్తున్న గిరిజన మహిళ కుంజా సీత రాజుపేట కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆదివాసీ గ్రామాల్లో, తండాల్లో నివాసం ఉండే గిరిజన జనాలు.. చిన్నప్పటి నుంచి దగ్గర్లోని చెరువులు, కాలవలు, మడుగుల వద్దకు వెళ్లి.. చేపలు పట్టి.. వాటని వండుకుని తింటూ ఉంటారు. ఈ క్రమంలోనే సూర్యుడు నడినత్తికొచ్చే వేళ.. అక్కడే ఉన్న చెరువుకి తోటి గిరిజన మహిళలతో కలిసి సీత చేపలను పట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే సీత వేసిన గాలానికి ఓ చిన్న చేప చిక్కింది. ఆమె ఇక్కడే ఓ పొరపాటు చేసింది.
బతికున్న చేప కావడంతో నోటితో కొరికి చంపేందుకు నోట్లో వేసుకుంది. ఇంకేమంది అది జారి గొంతులోకి ఇరుక్కుంది. తోటి గిరిజన మహిళలు ఎంత ప్రయత్నించినా నోటిలో ఉన్న చేప బయటకు రాకపోవడంతో.. ఓ సమయంలో ఆమె ప్రాణం పోతుందేమో అని అందరూ బయపడ్డారు. వెనువెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతి కష్టం మీద.. గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీసి ఆ మహిళ ప్రాణాలను కాపాడారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే శ్వాస సరిగా అందకపోవడంతో సీత ముఖం ఉబ్బంది. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..